ఒకనాడు ఆధ్యాత్మికతకు ఆలవాలంగా వెలుగు వెలిగిన దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో సమైక్య పాలనలో చీకట్లు అలుముకున్నాయి. పట్టించుకునే పాలకులు లేక ప్రాశస్థ్యాన్ని కోల్పోయే స్థితికి చేరుకున్నాయి. కానీ, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పునర్జీవం పోశారు. చిన్న గుడి నుంచి పెద్ద ఆలయాల వరకు ధూపదీప నైవేద్యం పథకాన్ని వర్తింపజేస్తూ వెలుగులు నింపుతున్నారు. అటు మైనార్టీ ప్రార్థనా మందిరాలకు సైతం పూర్వ వైభవం తెచ్చారు. సర్వమతాల పండుగలకు అధికారికంగా నిర్వహిస్తూ సర్వమత సామరస్యాన్ని చాటుతున్నారు. మరోవైపు తాజాగా 214 గుళ్లకు ధూపదీప నైవేద్యం కింద వర్తింపజేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ కృషితో రాష్ట్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుండగా, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా ‘నమస్తే’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
కరీంనగర్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సమైక్య పాలనలో ఆదరణ లేక ప్రాభవాన్ని కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు స్వరాష్ట్రంలో పునర్వైభవం సంతరించుకుంటున్నాయి. కేసీఆర్ సర్కారు కృషితో ఓ వెలుగు వెలుగుతున్నాయి. ప్రజల్లోనూ ఆధ్యాత్మకత వెల్లివిరిస్తున్నది. ఇదే సమయంలో ప్రధాన దేవాలయాలైన కొండగట్టు అంజన్న, ధర్మపురి నృసింహస్వామి, వేములవాడ రాజన్న ఆలయాలపై ప్రత్యేక దృష్టిపెట్టిన ప్రభుత్వం.. ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నది. మైనార్టీల ప్రార్థనా మందిరాల్లో ని మౌజమ్‌లు, ఇమామ్‌లకు నెలనెలా వేతనాలు ఇస్తున్నది. ఇటు ధూపదీప నైవైద్య పథకం కింద దేవాలయాల నిర్వహణతోపాటు పూజారులకు నెలనెలా గౌరవ వేతనాలు అందిస్తున్నది. నేడు ఆధ్యాత్మక దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఈ పథకాన్ని మరో 214 గుళ్లకు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేయగా.. బీఆర్ఎస్ సర్కారు హయాంలో సర్వమతాలకు సముచిత ప్రాధాన్యం దక్కుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పరాధీనమైన ఆలయాల భూములను తిరిగి రాబట్టేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ ఆలయాల ఆస్తుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహించనున్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్ధనా మందిరాలను అలంకరిస్తారు. దేవాలయాల్లో వేద పారాయణం, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
కరీంనగర్ కొద్ది రోజుల్లో మినీ తిరుమలగా మారబోతున్నది. టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం కాబోతున్నది. ఇప్పటికే వేములవాడ, ధర్మపురి, కొండగట్టు లాంటి ప్రముఖ పుణ్య క్షేత్రాలు ఉన్న ఉమ్మడి జిల్లాకు ఈ ఆలయం పూర్తయితే మరింత ఆధ్యాత్మిక శోభ రానున్నది. కరీంనగర్‌లోని పద్మనగర్ వద్ద ఈ అలయానికి రాష్ట్ర ప్రభుత్వం పదెకరాల భూమిని కేటాయించింది. ఆలయ నిర్మాణానికి టీటీడీ నుంచి 10 కోట్లు మంజూరు చేశారు. ఈ స్థలంలో గత నెలలో టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితుల చేతుల మీదుగా భూమిపూజ క్రతువులు నిర్వహించారు. పదెకరాల్లో 30 గుంటల్లో గర్భగుడి నిర్మాణం, తూర్పున ఒక అద్భుతమైన బావి, ఎడమ వైపు మరో అద్భుతమైన కోనేరు, మండపాలు, ఆలయ సిబ్బంది గదులు నిర్మించబోతున్నారు. వీటికి సంబంధించిన డిజైన్స్, ప్లాన్ అంతా ఇప్పటికే సిద్ధం చేశారు. ఆలయ కట్టడాలు, పూజా విధానం తిరుమల తిరుపతి ఆలయం తరహాలో ఉండనున్నాయి. టీటీడీ ఒక రాష్ట్రంలో ఒకే ఆలయాన్ని నిర్మిస్తున్నది. కానీ మన రాష్ట్రంలో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఇప్పటికే ఒక టీటీడీ ఆలయం ఉండగా, మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చొరవతో కరీంనగర్లో మరో ఆలయ నిర్మాణం కానున్నది. ఇది ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా భావించవచ్చు.
ప్రతి గుడిలో దీపం వెలగాలనే సంకల్పంతో ధూపదీప నైవేద్యం పథకాన్ని అన్ని గుడులకు విస్తరించారు. అందులో భాగంగా ఈ పథకం కింద ఎంపికైన ఒకో ఆలయానికి ప్రతినెలా 2వేలు, అర్చకుడికి 4వేల గౌరవ వేతనం ఇస్తున్నారు. అలాగే.. ఆలయ పూజరులు, ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తున్నారు. రాష్ట్రంలోని హిందువుల ఆలయాల వైభవాన్ని చాటడమే కాదుచ పండుగల వైభవాన్ని నలు దిశలా చాటిచెప్పేందుకు.. ప్రభుత్వం బతుకమ్మ, దసరా, శ్రీరామ నవమి లాంటి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నది. ప్రతి పండుగ ఆలయాల్లో వైభోపేతంగా జరుగుతున్నాయి. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు చీరలను కానుకగా ఇస్తున్నారు. పండుగేదైనా ఆలయాలు అలంకరణతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ధూపదీప నైవేద్యం పథకం కింద ఇప్పటికే 418 దేవాలయాలు ఎంపిక కాగా, నేటినుంచి మరో 214 దేవాలయలకు ఈ స్కీంను వర్తింప జేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంపై సర్వత్రా హర్షమవుతున్నది.
ఉమ్మడిజిల్లాలోని ప్రధాన దేవాయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. వేములవాడ రాజన్న ఆలయం పరిధిని విస్తరించేందుకు 30 కోట్లు వెచ్చించి 33 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అభివృద్ధి చేశారు. బద్దిపోచమ్మ ఆలయ విస్తరణకు 17.60 కోట్లు, వేములవాడతో అనుసంధానంగా ఉన్న అన్ని ప్రధాన రహదారుల అభివృద్ధికి 15.8 కోట్లు, రాజన్న ఆలయానికి మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చేందుకు 3.69 కోట్లు వెచ్చించారు. ఇవేకాక దాదాపు మరో 20 కోట్లతో టౌన్, దేవాలయ అభివృద్ధి పనులు సాగుతుండగా, భవిష్యత్తులో యాదాద్రి తరహాలో రాజన్న దేవాలయాన్ని వైభవంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ధర్మపురి నర్సింహస్వామి ఆలయ అభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చింది. వీటితో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. కొండగట్టు అంజన్న స్వామి అలయ అభివృద్ధికి 100 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఆంజన్న దేవాలయాన్ని సమగ్ర అభివృద్ధి చేసేందుకు పలు ప్రణాళికలు పురుడు పోసుకోగా కొన్ని పనులకు టెండర్లు సైతం పూర్తయ్యాయి. ఈ మూడు దేవాయాలు ప్రభుత్వం అనుకున్న తరహాలో అభివృద్ధి అయితే.. గొప్ప పర్యాటక కేంద్రాలుగా బాసిల్లనున్నాయి.
సర్వ మతాల సమ్మేళితంగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ సర్కారు, క్రైస్తవుల పండుగలకూ ప్రాధాన్యమిస్తున్నది. క్రిస్మస్ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నది. క్రిస్మస్ గిఫ్ట్‌ప్యాక్‌ను అందిస్తున్నది. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మినీ క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నది. ఇదే సమయంలో ప్రతి చర్చిని అందంగా అలంకరించుకునేలా ప్రత్యేక నిధులను అందిస్తున్నది.
రాష్ట్రంలోని ముస్లింల అభ్యున్నతికి సైతం ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రంజాన్, బక్రీద్ పండుగలకు ప్రార్థనా మందిరాలను అలంకరించుకునేలా ప్రత్యేక నిధులను ఇస్తున్నది. పండుగకు ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరఫున రంజాన్ గిఫ్ట్ ప్యాక్‌లను అందిస్తున్నది. పవిత్ర రంజాన్ మాసంలో ప్రభుత్వమే అధికారికంగా ఇఫ్తార్ విందును నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తున్నది. మసీదుల్లోని ఇమామ్‌లు, మౌజమ్‌లకు నెలకు 5వేల గౌరవ వేతనాన్ని ఇస్తున్నది.
గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలను గొప్పగా ఆదరిస్తున్నది. అసలు ఆలయాల్లో ధూప దీప నైవేధ్యం గురించి గతంలో ఏ ప్రభుత్వాలు ఆలోచించలేదు. కానీ, తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలకు పూర్వవైభవం వస్తున్నది. ధూప దీప నైవేద్యం కింద నెల నెలా 6వేలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో 10కోట్ల నిధులతో ఆరెకరాల భూమిలో బ్రాహ్మణ పరిషత్ నిర్మిస్తున్నారు. సీఎం కేసీఆర్ బీద పురోహితులు, బ్రాహ్మణుల కష్టాలను తెలుసుకొని మాపై వరాల జల్లు కురిపించారు. ధూప దీప నైవేద్యాల కోసం రాష్ట్రంలో 2769 దేవాలయాలను ఎంపిక చేయడంతో పాటు భృతిని 6వేలకు పెంచారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు నాలాంటి పేద బ్రాహ్మణులకు ఎంతో అండగా ఉంటాయి. నిజానికి సీఎ కేసీఆర్ దయ వల్లే నేను ఇలా సంతోషంగా జీవిస్తున్నా.
– పల్లి రాంమోహన్, మహాగణపతి దేవాలయం పూజారి, (మంథని)
మైనార్టీ వర్గాలకు చెందిన ప్రార్థనా మందిరాలు, పవిత్రబోధకుల సంక్షేమం విషయంలో గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలుస్తామని, బోధకుల సంక్షేమానికి వేతనాలు అందజేస్తామని ప్రకటించాయే తప్పా ఏనాడూ ఒక్క రూపాయి ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే సహకరిస్తున్నారు. మైనార్టీలకు చెందిన ప్రార్థనా మందిరాల్లో వసతులు, ఇతర సౌకర్యాల కల్పనకు పెద్ద సంఖ్యలోనే నిధులు మంజూరు చేశారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా జగిత్యాల జిల్లాలోని ముస్లిం మైనార్టీల ప్రార్థనా మందిరాల్లో వసతుల కల్పనకు దాదాపు 11 కోట్ల వరకు ఖర్చు చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుటి నుంచి మసీదుల్లో బోధన బాధ్యతలు నిర్వహించే ఇమామ్‌ల సంక్షేమం కోసం వారికి నెలకు 5వేల గౌరవ పారితోషికం అందజేస్తున్నారు. మసీదుల్లో ఆజాం చేసి, ఇతర పనులు చేపట్టే మౌజామ్లకు సైతం నెలకు 5వేల పారితోషికం అందజేస్తున్నారు. మైనార్టీలపై స్నేహపూర్వక భావంతో ఉన్న సీఎం కేసీఆర్ ఏటా రంజాన్ మాసంలో ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం, కుటుంబానికి తోఫా పేరిట నూతన వస్ర్తాలను అందించడం సంతోషం. సీఎం కేసీఆర్ సాబ్‌కో అల్లా ఖుష్ రకేగా. మైనార్టీయోకీ దువా సీఎం సాబ్‌కే సాత్ రహతేహై. ఇమామ్‌లు, మౌజమ్లతోపాటు మైనార్టీ వర్గాలకు చెందిన దువా ఎప్పుడు సీఎం కేసీఆర్‌కు ఉంటుంది.
– మౌలానా మొహమ్మద్ మజీద్ అలీ, ఇమామ్ (జగిత్యాల)