తెల్లని మల్లె పువ్వులాంటి దుస్తులు ధరించి, నెత్తిన చిన్న టోపి. చెరగని చిరునవ్వు, ఆప్యాయమైన పలకరింపుతో మన కండ్లముందు కదలాడే సేవామూర్తులు.. మన నర్సులు. వయస్సులో చిన్నవారైనా ఎంతో గుండె ధైర్యంతో రోగిలో భరోసా నింపే చల్లని నేస్తాలు. వార్డులోని పేషెంట్లే జగమంత కుటుంబంగా భావిస్తూ, తల్లిలా.. సోదరిలా సపర్యలు చేసే మానవతామూర్తులు. రోడ్డు ప్రమాదక్షతగాత్రులైనా.. పురిటినొప్పులతో వచ్చే గర్భిణులైనా.. మరింకెవరైనా దవాఖానకు వచ్చేవారిని తోబుట్టువుల్లా మొదట పలుకరించి, ఉన్నన్ని రోజులు అమూల్య సేవలందించి మనోభారం దూరంచేసే ప్రాణదాతలకు స్వరాష్ట్రంలోనే సగౌరవం దక్కింది. నర్సింగ్ ఆఫీసర్లుగా గుర్తించి, అదే హోదాతో పిలువాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. నేడు ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా సిస్టర్స్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ‘నమస్తే’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది.
– విద్యానగర్, మే 11
విద్యానగర్, మే 11: వైద్య రంగంలో నర్సులు.. కనిపించే దేవతలు. సేవా మూర్తులు. కాలిన గాయాలతో దవాఖానలకు వచ్చే బాధితులైనా.. రోడ్డు ప్రమాద క్షత గాత్రులైనా.. పురిటినొప్పులతో వచ్చే గర్భిణులైనా.. మరింకెవరైనా తోబుట్టువుల్లా మొదట పలుకరించేది వాళ్లే. రోగులే దైవంగా సేవలందిస్తూ వైద్య రంగానికే వన్నె తెస్తుండగా, నేడు ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
నేడు అంతర్జాతీయ నర్సు డే..
నర్సింగ్ వృత్తికి హుందాతనాన్ని తెచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ దేశాలన్నీ మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆరోగ్య రక్షణలో నర్సులు అందించిన కృషిని తలుచుకుంటూ ప్రతి ఏటా ఈ రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏటా నర్సింగ్ విభాగంలో విశిష్ట సేవలు అందిస్తున్న నర్సులకు రాష్ట్రపతి అవార్డులు అందించి సముచితంగా సత్కరిస్తున్నారు.
కరోనా సమయంలో సేవలు..
ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన కరోనాను కట్టడి చేయడంలో నర్సుల పాత్ర అమోఘమైంది. వారు అందించిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేవి. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, రోజుల తరబడి తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి సేవలందించారు. రోగులకు ఫ్లూయిడ్ అందించడం, రెమిడిసివర్ ఇంజక్షన్లు ఇవ్వడం, ఆక్సిజన్ అందించి, మానసిక ధైర్యాన్ని నింపి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. తమలో చాలా మంది కరోనా సోకి చనిపోతున్నా ధైర్యంగా సేవలందించి చరిత్రలో నిలిచిపోయారు.
నర్సింగ్ ఆఫీసర్లుగా ప్రభుత్వం గుర్తింపు
గత ప్రభుత్వాల హయాంలో కనీస గుర్తింపు లేకుండా ఉన్న నర్సులకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసింది. పదోన్నతులు కల్పించింది. నర్సులను నర్సింగ్ ఆఫీసర్లుగా గుర్తించింది. అదే హోదాతో పిలువాలని సూచించింది. దీంతో ప్రజల్లో గౌరవ హోదా లభించింది.
రెండేండ్లు కొవిడ్ వార్డులో డ్యూటీ చేశా..
కరోనా టైంలో ప్రాణాలకు తెగించి రెండేండ్లు కొవిడ్ వార్డులోనే డ్యూటీ చేశా. ఆరోగ్యం సహకరించకున్నా కుటుంబానికి దూరంగా ఉంటూ సేవలందించా. ఈ వృత్తి ఆనందంగా ఉంది. ఇప్పటికి అధికారుల నుంచి మూడు సార్లు ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకోవడం మరింత బాధ్యత పెంచింది. నా వృత్తిలో ఎక్కువ శాతం కుటుంబ నియంత్రణ విభాగంలో పని చేశా. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలందించడం ఆనందంగా ఉంది.
– పిట్టల విజయలక్ష్మి, నర్సింగ్ సూపరింటెండెంట్
వైద్యంతో పాటు ధైర్యం చెబుతున్నాం
దవాఖానలో చికిత్స కోసం వస్తున్న రోగులకు వైద్యంతో పాటు మనోధైర్యాన్ని కల్పిస్తున్నాం. మా కుటుంబ సభ్యుల్లాగా ఆదరిస్తూ భరోసా కల్పిస్తున్నాం. నేను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నా డ్యూటీ టైమింగ్స్ పూర్తిగా పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడే ఉండేవి. ఎంతో మంది ప్రాణాలను కాపాడామన్న తృప్తి ఉంది. కొండగట్టు బస్సు సంఘటన, ఆదిలాబాద్ జిల్లాలో ట్రాక్టర్ బోల్తా ఘటనలో వైద్య సేవలందించడం ఆనందంగా ఉంది.
– సరళ, నర్సింగ్ సూపరింటెండెంట్
కొవిడ్‌లో ప్రాణాలకు తెగించి పనిచేశాం..
కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి ఎంతోమంది రోగుల ప్రాణాలను కాపాడా. కుటుంబాలకు దూరంగా ఉండి వైద్య సేవలందించా. ఈ వృత్తి నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. ప్రస్తుతం ఎంసీహెచ్‌లో సేవలందిస్తున్నా. ఎక్కువగా సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తున్నాం.
– తిరుమల, స్టాఫ్‌నర్స్
వృత్తి సంతృప్తినిచ్చింది
నర్సింగ్ వృత్తి నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. నైటింగెల్ ఫ్లారెన్స్ మాకు ఆదర్శం. రోగులకు సేవ చేయడమే పరమావధిగా భావిస్తా. ఆపరేషన్ థియేటర్లలో 24 గంటలు సేవలందించా. డ్రెస్ వేసుకున్నాక పూర్తి స్థాయిలో విధుల్లో నిమిగ్నమైపోతా. 1988లో దసరా పండుగ సందర్భంగా దవాఖానాలో నాతో పాటు సులోచన, ఇద్దరమే డ్యూటీ చేశాం. పని ఒత్తిడి ఎంత ఉన్నా, కుటుంబాలకు దూరమైనా వృత్తినే దైవంగా భావించి సేవలందించాం.
– అంజమ్మ, నర్సింగ్ సూపరింటెండెంట్
ఎక్కువ సమయం దవాఖానకే..
ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నేను ఎక్కువగా వృత్తికే అంకితమయ్యా. మా కుటుంబ నేపథ్యం నుంచే నాకు అలవాటైంది. విధుల్లో ఉన్నంత సేపు పూర్తిస్థాయిలో సేవలందించడమే పరమావధిగా భావిస్తా. అదనపు బాధ్యతలున్నప్పటికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నా. కొవిడ్ విధుల్లో మొదటి నుంచి పూర్తిస్థాయిలో వార్డులకు ఇన్చార్జిగా ఉంటూ సిబ్బందిని సమన్వయం చేస్తూ పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మనో ైస్థెర్యాన్ని కల్పించి ఎంతో మంది ప్రాణాలు కాపాడామన్న సంతోషం ఉంది.
– జనగామ సులోచన, నర్సింగ్ సూపరింటెండెంట్
కుటుంబ సభ్యుల్లా భావిస్తున్నాం
పేదలకు వైద్య సేవలందించడం ఆనందంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కోసం ఇక్కడికి ఎంతోమంది వస్తున్నారు. వారిని మా కుటుంబ సభ్యుల్లాగా భావించి సేవ చేస్తున్నాం. ప్రతి రోగిపై శ్రద్ధ పెడుతూ వైద్యం అందిస్తాం. రేయింబవళ్లు విధులు నిర్వహిస్తూ కుటుంబాలకు దూరంగా ఉంటున్నాం. అయినా ప్రజలకు సేవ చేయడం సంతృప్తినిస్తుంది.
-జే ప్రసన్నకుమారి, స్టాఫ్‌నర్స్