CP Ambar Kishore Jha | పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 6 : త్వరలో జరుగనున్న మూడు విడుత ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. స్థానిక సంస్థలకు జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తులు, బందోబస్తు విషయంలో పెద్దపల్లి మండలం పెద్దకల్వల శివారులో గల పెద్దపల్లిరూరల్ పోలీస్ స్టేషన్ ను శనివారం సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఎన్నికల సరళి, నామినేషన్ కేంద్రాలు(క్లస్టర్ల) వద్ద బందోబస్తుపై సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. అందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు, అలాగే రౌడీషీటర్ల వివరాలు తెలుసుకొని వారి కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయిలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది తమతమ గ్రామాల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.
పోలీస్ స్టేషన్ పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, రికార్డుల నిర్వహణ, సిబ్బంది క్రమశిక్షణ తో విధులు నిర్వహించాలని, విజబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, గ్రామాలలో పెట్రోలింగ్ నిర్వహించాలని, ప్రజల భద్రత శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు వ్యవస్థ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఇక్కడ పెద్దపల్లి రూరల్ ఎస్ఐ మల్లేష్ తదితరులున్నారు.