ఫర్టిలైజర్‌సిటీ, ఏప్రిల్ 20: అప్పటిదాకా కండ్లముందు ఆడుకుంటున్న బాలుడు అనుకోని రీతిలో మృత్యుఒడికి చేరాడు. ఒక్కసారిగా రోడ్డుపైకి వెళ్లడంతో కారు ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ముత్తారం మండలం మచ్చపేటకు చెందిన పులిపాక రమేశ్, సంధ్య దంపతులకు కొడుకు శివరాజ్‌కుమార్ (3), మూడు నెలల పాప ఉన్నారు. రమేశ్ కొండగట్టు జేఎన్టీయూలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే సంధ్య పాప పుట్టినప్పటి నుంచి తన తల్లిగారిల్లు అయిన రామగుండం నగర శివారులోని గంగానగర్‌లో కొడుకుతో ఉంటున్నది. ఆదివారం శివరాజ్ ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ఉన్నాడు. అంతలోనే ఒక్కసారి రోడ్‌పైకి వెళ్లాడు. ఈ సమయంలో మంచిర్యాల నుంచి గంగానగర్‌కు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బంధువులు గోదావరిఖనిలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా అప్పటికే మృతి చెందాడు. తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన గంగానగర్‌కు చెందిన కారు డ్రైవర్ ఎం వెంకటేశ్‌పై వన్‌టౌన్ ఎస్ఐ భూమేశ్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.