Ramagundam Baldia | కోల్ సిటీ. మే 24: రామగుండం నగర పాలక సంస్థ అధికారులు, అధికార పార్టీ నేతల కఠినత్వం మితిమీరుతుంది. అభివృద్ధి పేరుతో కూల్చివేతల పర్వం రానురానూ వివాదాలకు దారితీస్తుంది. శనివారం గోదావరిఖనిలో కూల్చివేతలు హద్దుమీరి ప్రజల ప్రాణాల మీదకు వచ్చిన సంఘటన ఉలిక్కిపడేలా చేసింది. ఆమాంతం… మూడంతస్తుల భవనం జనం చూస్తుండగానే ఒక్కసారిగా భారీ శబ్దాలతో నేలమట్టం కాగా, శిథిలాల కింద ఇరుక్కపోయి ఎక్స్కవేటర్ వాహన డ్రైవర్ మృత్యుంజయుడయ్యాడు. ఏం జరిగిందో అని తేరుకొని బయటకు వచ్చేలోగా ఎక్స్కవేటర్ వాహనం ధ్వంసమైంది. అప్పటికే భవనం అమాంతం నేలమట్టడం అవుతున్న క్రమంలో ప్రధాన రోడ్డుపై ఉన్న విద్యుత్ తీగెలు, స్తంభాలు తెగి కింద పడటంతో స్థానికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. టార్గెట్ ప్రకారమే ఒక పద్ధతి, ప్రణాళిక, భద్రత లేకుండా కూల్చివేతలకు ఒడిగట్టటం నగర పాలక అధికారుల తీరుపై ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు.
అమాంతం… కుప్పకూలిన మూడొంతస్తుల భవనం
కాగా, గోదావరిఖని మార్కండేయ కాలనీలో రోడ్ల అభివృద్ధి పేరుతో నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం మూడొంతస్థుల భవనంను కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీస్ పహారా మధ్య ప్రైవేటు ఎక్స్కవేటర్ వాహనంతో కూల్చివేయడం ప్రారంభించారు. సివిల్ కాంట్రాక్టర్కు చెందిన ఆ భవనంను సదరు యజమాని ముందు రోజు రాత్రే స్వచ్ఛందంగా తొలగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకొని కాంగ్రెస్ నాయకుల పురమాయింపుతో నగర పాలక అధికారులు ఎక్స్కవేటర్ వాహనంతో అక్కడకు వచ్చి తామే కూల్చివేస్తామని రంగంలోకి దిగారు.
ఐతే ఏలాంటి రక్షణ గానీ, భద్రత గానీ లేదు. ఎక్స్కవేటర్ డ్రైవర్ ఒక్కో అంతస్థును కూల్చివేస్తుండగా అధికారులు జారుకున్నారు. అప్పటికే స్థానికులు తండోప తండాలుగా గుమిగూడారు. పోలీసులు, కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది అంతా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇంతలోనే అమాంతం ఆ మూడంతస్థుల భవనం ఒక్కసారిగా భారీ శబ్ధంతో కుప్పకూలింది. ప్రధాన రోడ్డుపై ఉన్న విద్యుత్ తీగెలు, స్తంభాలు ఆ శిథిలాల కింద నేలమట్టమయ్యాయి. అప్పటికే ఎక్స్కవేటర్ డ్రైవర్ ఆ శిథిలాల కింద చిక్కుకపోయాడు. దీంతో ఒక్కసారిగా ఆందోళనకర వాతావరణం నెలకొంది.
అదృష్టవశాత్తు వాహన డ్రైవర్ మృత్యుంజయుడై గాయాలతో బయటకు వచ్చాడు. ఎక్స్కవేటర్ వాహనం శిథిలాల కింద పడి ధ్వంసమైంది. ఈ నష్టంకు బాధ్యులెవరని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా అంత పెద్ద భవనం కూల్చివేసే ముందు ఒక పద్ధతి ప్రణాళికలు లేకుండా వ్యవహరించడంతో స్థానికులు ఆగ్రహోదగ్రులయ్యారు. భవనం కుప్పకూలే సమయంలో శిథిలాలు ఎగిరి వచ్చి ప్రజల మీద పడి ప్రాణనష్టం జరిగితే బాధ్యులెవరని ప్రశ్నించారు. కూల్చివేతలపై ఉన్న శ్రద్ధ ముందు జాగ్రత్తలపై ఎందుకు ఉండదని నిలదీశారు.
తప్పిన ప్రాణనష్టం..
కాగా, భారీ భవనం కూల్చివేత ఘటనలో ప్రాణనష్టం తప్పడంతో ఒకింత అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ప్రాణనష్టం జరిగి ఉంటే పరిస్థితి ఏలా ఉండేదోనని తలుచుకొని ఆందోళనకు గురయ్యారు. మార్కండేయ కాలనీ ప్రధాన రహదారి కావడం, నిత్యం జన సంచారం ఉండటం అక్కడే ప్రైవేటు హాస్పిటళ్లు ఉండటం ఇవన్ని దృష్టిలో ఉంచుకొని పద్ధతి, ప్రణాళిక లేకుండా ఎవరో చెప్పారని పరుగున వచ్చి అధికారులు కూల్చివేత చేపట్టారు. కానీ ఊహించని విధంగా ఆ భవనం జనం చూస్తుండగా అమాంతం రోడ్డుపై పడింది.
ఒకవేళ బండరాళ్లు ఎగిసి పడి సమీపంలో ఉన్న ప్రజల మీద పడితే? ప్రాణనష్టం జరిగితే? ఎవరు బాధ్యులంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంగా నగరంలో జరుగుతున్న కూల్చివేతలు హద్దు మీరి అవాంఛనీయ సంఘటనలకు దారి తీయడంతో అధికార పార్టీ నాయకులు, అధికారుల తీరుపై ప్రజలు నానా రకాలుగా దూషణలకు దిగుతుండడం కొసమెరుపు.