నాటి సమైక్య పాలనలో రైతులంటే చిన్నచూపు. ఆరుగాలం శ్రమించే అన్నదాతకు కనీస ప్రోత్సాహం ఉండేది కాదు. అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నా.. లేదంటే ఏదైనా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినా కుటుంబాలకు ఎలాంటి భరోసా ఉండేది కాదు. ఇంటి పెద్దను కోల్పోయి రోడ్డునపడ్డా కనీస సాయం అందేది కాదు. పిల్లలు చదువులను మధ్యలోనే ఆపేసినా చేయూత ఉండేది కాదు.
నేడు తెలంగాణ ప్రభుత్వం రైతన్నకు అన్నివిధాలా అండగా నిలుస్తున్నది. ఎవుసాన్ని పండుగలా మార్చడమే కాదు, రైతును రాజును చేసే సంకల్పంతో అనేక పథకాలు అమలు చేస్తున్నది. ఇంటి పెద్దదిక్కైన రైతు ఎలా మరణించినా.. ఆ కుటుంబానికి ధీమానిస్తున్నది. రైతుల పిల్లల భవిష్యత్‌కు భరోసానిస్తున్నది.
కారణం ఏదైనా కావొచ్చు రైతు మరణిస్తే ఆ కుటుంబం అనాథ కావొద్దు. ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉంది. అందుకే దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నాం. రైతు మరణించిన 10 రోజుల్లో ఆ ఇంటికి రూ. 5 లక్షల చెక్కు వస్తుంది. నా జీవితంలో నేను చేసిన అత్యంత గొప్ప పనిగా దీనిని భావిస్తున్నా.
– రైతు బీమా ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన రైతు బీమా పథకం నేటితో ఐదేళ్లు పూర్తి చేసుకున్నది. సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలోనే ప్రకటించి అమలు చేస్తున్న ఈ పథకం, కర్షక కుటుంబాలకు కొండంత ఆసరా అవుతున్నది. రైతు ఏ కారణంతో చనిపోయినా ఆ ఇంటికి 5 లక్షల బీమా అందిస్తూ ధైర్యాన్నిస్తున్నది. గతంలో ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే కనీసం ఆదరించే పరిస్థితులు కరువవగా, నేడు రాష్ట్ర ప్రభుత్వం అలాంటి కుటుంబాలకు కొండంత ధీమా కల్పిస్తున్నది. 2018 ఆగస్టులో ప్రవేశ పెట్టిన ఈ పథకం కింద ఐదేళ్లలో పదివేలకుపైగా కుటుంబాలకు 500 కోట్లకుపైగా పరిహారం అందగా, ఆయా కుటుంబాలు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నాయి. పెద్ద దిక్కును కోల్పోయిన బాధ తీర్చలేనిదే అయినా.. ఆపద సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తున్న తీరును కొనియాడుతున్నాయి.
– కరీంనగర్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్ (నమస్తే తెలంగాణ)
రైతు బీమా లేకుంటే మా ఇల్లు రోడ్డున పడేదే
… పక్క ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు శేర్ల మంజుల. భర్త అశోక్. వీరికి ఒక కూతురు, కొడుకు. వీరిది తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి. అశోక్ పేరిట గ్రామంలో 32 గుంటల భూమి ఉన్నది. అందులో ఎవుసం చేసేవారు. మంజుల దివ్యాంగురాలు కావడంతో కూలీ పనులు చేస్తూ అశోక్ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. 2021లో ఓ రోజు అశోక్ పొలం పనులకు వెళ్తూ, సైకిల్‌పై నుంచి కింద పడిపోయాడు. సుమారు 20 రోజుల పాటు దవాఖానలో చికిత్స పొందాడు. రూ.లక్ష వరకు వైద్యానికి ఖర్చు చేసినా ప్రాణం దక్కలేదు. 2021 సెస్టెంబర్ 11న దవాఖానలోనే చనిపోయాడు. పెద్దదిక్కు కోల్పోయిన ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. ఆ సమయంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం ఆసరా అయింది. బీమా సొమ్ము 5 లక్షలు పదిరోజుల్లోనే ఆమె బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. వచ్చిన డబ్బుతో వైద్యానికి చేసిన అప్పును తీర్చి, కూతురు అనూష పెండ్లికి 3 లక్షలను బ్యాంకులో ఆమె డిపాజిట్ చేసింది. “రైతు బీమా సొమ్ముతో నా కూతురు పెండ్లి చేస్త. నాకు పింఛన్ వస్తంది. కొడుకు వంశీ కూడా పని చేస్తుండు. ఆయన లేడన్న బాధ తప్ప మా ఇల్లు సాఫీగా గడుస్తాంది. రైతు బీమా లేకుంటే మా ఇల్లు రోడ్డున పడేదే. సీఎం కేసీఆర్ సల్లంగుండాలె’ అంటూ అశోక్ భార్య మంజుల మనసారా కృతజ్ఞతలు చెబుతున్నది.
నాడు రైతుల ప్రాణాలకు భద్రత ఉండేది కాదు. అప్పుల బాధతోనో.. ఏదైనా ప్రమాదాలతోనో, లేదంటే అనారోగ్యంతోనో ఎలా చనిపోయినా బాధిత కుటుంబాలకు కనీసం సాయం అందేది కాదు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయి రోడ్డునపడ్డా భరోసా ఇచ్చే దిక్కు లేదు. ఉద్యమ సమయంలో రైతుల కష్టాలను కండ్లారా చూసిన కేసీఆర్, స్వరాష్ట్రంలో రైతు సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చారు. వినూత్న పథకాలను ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని పండుగలా మార్చడమే కాదు, రైతుకు అన్ని విధాలా భరోసాగా నిలుస్తున్నారు. రైతు ఎలా చనిపోయినా కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ‘రైతు బీమా’ పథకాన్ని తెచ్చారు. ఏటా రైతులపై భారం పడకుండా ప్రీమియం చెల్లిస్తూ, 2018 నుంచి విజయవంతంగా అమలు చేస్తూ అండగా నిలుస్తున్నారు.
కరీంనగర్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్ (నమస్తే తెలంగాణ) : గతంలో కాలంకాక, పంటలు పండక అప్పుల పాలైన ఎందరో రైతులు గతంలో ఆత్మహత్యలు చేసుకోవడం, అనారోగ్యం, ప్రమాదాలు, అకాల మరణాల కారణంగా పెద్ద దిక్కును కోల్పోయి వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయేవి. వ్యవసాయం చేసే దిక్కు లేక ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడేవి. పిల్లల చదువులు, పెండ్లిళ్లు ఆగిపోయేవి. ఉమ్మడి రాష్ట్రంలో ఇదొక సామాజిక సమస్యగా అవతరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా నిలిచి వారి సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నది. అందులో భాగంగా వచ్చిన రైతు బీమా పథకం ఇప్పుడు పెద్ద దిక్కును కోల్పోయిన రైతు కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నది. 2018 ఆగస్టు 14 నుంచి ఈ పథకం అమలులోకి వచ్చింది. 18 నుంచి 59 ఏండ్లు ఉన్న ప్రతి రైతును అర్హునిగా ప్రకటించి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ఎల్ఐసీకి రైతుల పేర్లపై పూర్తి ఉచితంగా ప్రీమియం చెల్లిస్తున్నది. ఏ కారణం చేతనైనా రైతులు మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షలు అందిస్తున్నది. ఐదేళ్లలో చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా పథకంలో చేరుతున్న రైతుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. అయినా, రాష్ట్ర ప్రభుత్వ వారి పేరిట ప్రీమియం చెల్లిస్తూ వస్తున్నది. రైతులు మరణించిన వారం పది రోజుల్లో ఆ కుటుంబానికి పాలసీ క్లెయిమ్ చేయిస్తున్నది. దీనిని చాలా సులభతరం చేయడంతో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రైతు కుటుంబాలు ఈ బీమా మొత్తాన్ని పొందుతున్నాయి. ఇంత మంచి పథకాన్ని సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా వేదికగానే ప్రకటించారు. 2018 ఫిబ్రవరిలో జరిగిన రైతుబంధు సమితి ప్రాంతీయ సదస్సులో రైతుల కోరిక మేరకు ఆయన ఈ పథకాన్ని ప్రకటించి, అదే యేడాది ఆగస్టు 14 అర్ధరాత్రి నుంచి అమలులోకి తెచ్చారు.
రైతు కుటుంబాలకు భరోసా
గతంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉండేది. అప్పులు చేసి, పంటలు పండక రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉండేవి. ఇలాంటి అకాల, బలవంతపు మరణాలు వారి కుటుంబాలపై తీవ్రమైన ప్రభావం చూపేవి. అసలే పంటలు పండక ఇబ్బందుల్లో ఉన్న రైతుల కుటుంబాలు ఆర్థికంగా మరింత చితికి పోయేవి. ఇంటి పెద్ద దిక్కు మరణంతో ఆ కుంటుంబాలు వీధి పాలయ్యేవి. అప్పులు చెల్లించలేక భూములు అమ్ముకునే పరిస్థితి కూడా కనిపించేది. పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోయేవి. రైతులుగా జీవనం సాగించిన ఆ కుటుంబాలు కూలీలుగా మారిపోయిన అనేక సందర్భాలు రాష్ట్ర ఏర్పాటుకు ముందు కనిపించేవి. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతు బీమా వంటి ఎన్నో గొప్ప పథకాలు తెచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం గడచిన ఐదేళ్లుగా రైతుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నది. రైతు ఏ కారణంతో మరణించినా కేవలం మరణ ధ్రువీకరణ పత్రంతో రైతు బీమా సొమ్మును వారం పది రోజుల్లో ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. అప్పుల కోసం భూములు అమ్ముకోవాల్సిన అఘాయిత్యం రైతు కుటుంబాలకు రావడం లేదు. పిల్లల చదువులు కొనసాగుతున్నాయి. అప్పులు తీర్చుకుంటున్నారు. కొందరు రైతులు ఇండ్లు కూడా కట్టుకుని హాయిగా జీవిస్తున్నారు. ఇలాంటి పథకం మంగళశారం ఐదేళ్లలో అడుగు పెడుతున్న సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెచ్చినకాడ అప్పులు కట్టుకున్న
మాకున్న కొద్ది పాటి భూమిల పొలం చేసుకుని, పని లేనినాడు, కైకిలి పనికి పోయెటోళ్లం. నా భర్త సుతారి పనికి పోయేది. కూలీ తెస్తే కుటుంబం అంతా గడిసేది. ఓ రోజు నేను పత్తి కల్వడానికి పోయిన. నా భర్త పనికి పోయి ఇంటికి వచ్చిండు. అప్పటిదాక మంచిగనే ఉండె. ఉన్నట్టుండి ఇంట్లనే కుప్పకూలిపోయిండు. దీంతో మావోళ్లు పక్కోళ్లు వచ్చి దవాఖానకు ఏసుకపోయే సరికే పాణాలు పోయినయ్. మా ఇంట్ల పెద్ద దిక్కుపోయినంక మా కుటుంబం ఆగమైంది. మాకు తెలిసిన కులస్థులు, వాళ్లు వీళ్లు కలిసి సీఎం కేసీఆర్ ఇచ్చే రైతు బీమా గురించి తెలుసుకున్నం. అధికారులే మా ఇంటికి వచ్చి రాసుకొని పొయిండ్రు. వారం రోజుల్లో ఐదు లక్షల రూపాయలు నా ఖాతాలో జమైనయ్.
– కులేరు కాశవ్వ, మామిడిపల్లి (కోనరావుపేట)
కేసీఆర్ సారు మేలు మరువం
మాది నిరుపేద కుటుంబం. మాకు రెండెకరాల భూమి ఉండగా, మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని ఎవుసం చేసేది. నా భర్త సంపత్ ఎవుసంతోపాటు ఒగ్గు కథలు చెప్తూ కుటుంబాన్ని సాకేది. మాకు ఇద్దరు పిల్లలు నాని(6వ తరగతి), హన్సిక (2వ తరగతి). కౌలుకు తీసుకున్న భూమిల మక్కజొన్న వేసినం. పోయిన జనవరి 3వ తారీఖున పంటకు నీళ్లు పెట్టడానికి నేను, నా భర్త కలిసి పోయినం. అక్కడ కరెంట్ మోటర్ పెట్టడానికి పోయిండు. ఇంతల్నే షాక్ కొట్టడంతో నా కళ్ల ముందే ప్రాణాలు ఇడిచిండు. ఇంటి పెద్ద దిక్కు పోయిండు.. ఎట్ల బతుకుడు దేవుడా.. అని ఉన్న సమయంల మాకు ప్రభుత్వం రైతు బీమా కింద రూ.5 లక్షలు ఇచ్చింది. అవి నా పిల్లలను చదివించుకోవడానికి అక్కెరకు అత్తున్నయ్. కొన్ని పైసలు మా బిడ్డ పేర బ్యాంక్‌ల ఏసుకున్న. బీమా పథకమే లేకపోతే మా బతుకులు ఎట్లా ఉండునోనని తలచుకుంటే భయమేసింది. ఈ సాయం చేసిన కేసీఆర్ సార్‌ను ఎప్పటికీ మరువం
– వీరముష్టి స్వప్న, మృతి చెందిన రైతు భార్య, గూడెం(ఓదెల)
బీమా పైసలే బతుకునిస్తున్నయ్
మాది పేద కుటుంబం. మా ఆయన పేరు కొమురయ్య. గొర్రెలను కాయడంతోపాటు, హమాలీ పని చేసుకుంట కుటుంబాన్ని సాదేది. మాకు ఇద్దరు కొడుకులు. అందులో పెద్ద కొడుకు రాజ్‌కుమార్ దివ్యాంగుడు. చిన్నోడు కైకలి పనికి పోతడు. పేదరికంతో కుటుంబ పరిస్థితి బాగో లేక ఆయన ఆత్మహత్య చేసుకున్నడు. మాకు మూడెకరాల భూమి ఉంది. ఆయన పేరు మీద భూమి ఉండడంతో మాకు రూ.5 లక్షలు అచ్చినయ్ ఆ పైసల్లో కొంత అప్పు కట్టుకున్నం. మిగతా పైసలతో మేం బతుకుతున్నం. ఇంటాయన పోయిండు ఎట్లా బతుకుడు అనుకున్నం. కానీ, కేసీఆర్ సార్ మంచి పథకం పెట్టిండు. మాలాంటి పేద రైతుల కుటుంబాలకు ఆ పైసలు శానా అక్కరకు అత్తన్నయ్. కేసీఆర్ సార్‌కు రుణ పడి ఉంటం.
– నంద పద్మ, ఆత్మహత్య చేసుకున్న రైతు భార్య, గూడెం(ఓదెల)