జగిత్యాలటౌన్, జూన్ 11 : ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి ఎందరో మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ కాలక్రమేణా శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం ఈ స్కూల్లో తెలుగు, ఇంగ్లిష్, ఊర్దూ మాధ్యమాల్లో బోధన జరుగుతుండగా, 300 మంది పిల్లలు అభ్యసిస్తున్నారు. 25 మంది టీచర్లు పనిచేస్తున్నారు. అయితే విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేకపోవడంతో గత బీఆర్ఎస్ సర్కారు ‘మనబస్తీ -మనబడి’ కింద 10 అదనపు గదుల కోసం రూ.2కోట్లు మంజూరు చేసింది. పాత భవనంలో ఒకదాన్ని కూల్చివేసి ఏడాది క్రితం పనులు మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఉన్న ఆరు గదుల్లో ఐదింటిని బోధనకు వినియోగిస్తున్నారు. వాటిలోనే మూడు మాధ్యమాల్లో 300 మంది పిల్లలకు అష్టకష్టాలు పడుతూ టీచర్లు బోధిస్తూ వస్తున్నారు. పాతభవనంతోపాటే ఉన్న మరుగుదొడ్లను కాంట్రాక్టర్ కూల్చివేయడం విద్యార్థులు, ఉపాధ్యాయులకు పెద్ద సమస్యగా మారింది.
పక్కనున్న హాస్టల్ భవనంలో, ఇతర చోటికి వెళ్లే పరిస్థితి నెలకొన్నది. ఇదొక్కటే కాదు మధ్యాహ్న భోజనానికి పిల్లలు. సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వంటగది లేక ఆరుబయట ఏదో ఒక చోట వండి విద్యార్థులకు వడ్డించే పరిస్థితి నెలకొంది. కనీసం నీడలో కూర్చుని తినే పరిస్థితిలేదు. కొత్త భవనం పూర్తయ్యేదాకా అయినా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తే తమకీ బాధలు ఉండేవికాదని విద్యార్థులు, సిబ్బంది వాపోతున్నారు. ఇదిలా ఉండ గా, ఈ విద్యా సంవత్సరమైనా కొత్త భవనం అందుబాటులోకి వస్తుందని ఆశపడగా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. బిల్లులు రావడం లేదనే సాకుతో బేస్మెంట్ వరకు మాత్రమే పనులు చేసి నిలివేశారు. దీనికితోడు కూలగొట్టిన భవనం కాంక్రీటు మట్టిని సగమే తీసి ఉన్న తరగతి గదులకు అడ్డుగా ఉంచడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు పలుసార్లు గాయపడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే నేటి నుంచి బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు, టీచర్లకు ఇబ్బందులు ఎదురుకాకుండా స్కూల్లో తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.