రోగులకు సేవలందించాల్సిన కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలోని పలువురు వైద్యులు, సిబ్బంది వర్గాలుగా విడిపోయి.. పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జడ్పీ చైర్పర్సన్ విజయ చేసిన ఫిర్యాదులోనూ ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. పలువురు వైద్యులు, సిబ్బందిపై కలెక్టర్ పమేలా సత్పతి చర్యలు తీసుకోగా, ఆమె చర్యలపైనా జోరుగా చర్చ సాగుతున్నది. అంతేకాదు, తమపై చర్యలు తీసుకోవడానికి కలెక్టర్‌కు అధికారం లేదంటూ కొంత మంది వైద్యులు వాదనలు తెరపైకి తేవడం హాట్ టాపిక్‌గా మారింది.
విద్యానగర్, జనవరి 16: జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ గత నెల 12న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దవాఖాన అభివృద్ధి కమిటీ (హెచ్‌డీసీ) చైర్ పర్సన్‌గా ఉన్న ఆమె పలు విషయాలపై విచారణ జరపాలని కోరారు. 2022 జనవరి నుంచి హెచ్‌డీసీ సమావేశం నిర్వహించడం లేదని, హెచ్‌డీసీ నుంచి ఆమోదం పొందాల్సిన ఫైల్స్ తనకు రావడం లేదని, దవాఖానకు ప్రభుత్వం నుంచి వస్తున్న, హెచ్‌డీసీ నుంచి కొనుగోలు చేస్తున్న మందుల వివరాలు తనకు తెలుపడం లేదని, ప్రజాప్రతినిధులు ఫోన్ చేస్తే అధికారులు స్పందించడం లేదని, తదితర విషయాలపై విచారణ చేపట్టాలని ఆమె కోరారు. ఈ మేరకు కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా వైద్యాధికారి లలితాదేవిని విచారణ అధికారిగా నియమించి విచారణ చేయించారు.
జడ్పీ చైర్పర్సన్ ఫిర్యాదుతోపాటు ఉన్నతాధికారులకు అందిన మరిన్ని ఫిర్యాదులపై విచారణాధికారి విచారణ చేసినట్టు తెలుస్తున్నది. దీంతో పలువురు వైద్యులు, సిబ్బంది పరస్పర ఆరోపణలు చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో మరింత లోతుగా విచారణ జరిపినట్టు సమాచారం. దీంతో సంబంధిత సిబ్బంది అక్రమాలు బహిర్గతం కాగా, పూర్తి స్థాయి నివేదికను కలెక్టర్‌కు విచారణాధికారి సమర్పించినట్లు తెలుస్తున్నది.
పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న దవాఖాన వర్గాలు.. కలెక్టర్ చర్యలపై కూడా రకరకాలుగా చర్చిస్తున్నారు. అసలు కలెక్టర్‌కు చర్యలు తీసుసుకునే అధికారమే లేదని, నిబంధనల ప్రకారం ఆ అధికారం సంబంధిత కమిషనర్‌కు మాత్రమే ఉంటుందని ఓ వర్గం తమ వాదనను తెరపైకి తెచ్చినట్టు తెలుస్తున్నది. తమకు ఏమి కాదన్న ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదే సమయంలో కృష్ణప్రసాద్‌పై కమిషనర్ చర్యలు తీసుకుంటే.
అదే స్థాయి హోదా ఉన్న మరో వైద్యురాలిపై మాత్రం ఇక్కడే ఎలా చర్యలు తీసుకుంటారని చర్చిస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఇప్పుడు కలెక్టర్ తీసుకున్న చర్యలు సైతం దవాఖాన వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మున్ముందు ఇంకా ఎటువంటి పరిణామాలు తలెత్తుతాయో తేలనుండగా, రోగులకు సేవలందించాల్సిన దవాఖాన వైద్యులు, సిబ్బంది వర్గాలుగా విడిపోయి.. దవాఖానను రచ్చకెక్కించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యవస్థను చక్కదిద్దేందుకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నివేదిక ఆధారంగా కలెక్టర్ ఇప్పటికే పలువురు సిబ్బందిపై వేటు వేశారు. ఆ మేరకు కొంత మందిని డిప్యూటేషన్‌పై పంపగా, మరికొంత మందికి షోకాజ్ నోటీసులు, ఇంకొందరికి మెమోలు ఇచ్చారు. డీసీహెచ్ఎస్ కృష్ణప్రసాద్‌పై చర్యల కోసం వైద్య విధాన పరిషత్ కమిషనరేట్‌కు నివేదించారు. ఆ మేరకు డీసీహెచ్ఎస్గా కరీంనగర్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఆయనకు తిరిగి పెద్దపల్లిలో పోస్టింగ్ ఇస్తూ కమిషనరేట్ నుంచి ఆదేశాలు ఇచ్చారు. మిగతా వారిలో ఆర్ఎంవో జ్యోతికి మెమో ఇస్తూ జమ్మికుంటకు వర్క్ ఆర్డర్ ఇచ్చారు.
పిల్లల వైద్యుడు అజయ్‌కుమార్, ఫిజిషీయన్‌గా పనిచేస్తున్న డాక్టర్ కనుకం శ్రీనివాస్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఏవో ఆఫీస్ సూపరింటెండెంట్, సంబంధిత క్లర్క్‌లకు మెమోలు ఇచ్చారు. విధి నిర్వహణ, రికార్డుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినందుకు సంబంధిత వైద్యులు, సిబ్బందిపై ఈ తరహా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ సమాచారాన్ని పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్‌తో పాటు వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు కలెక్టర్ పంపినట్లు సమాచారం.