KALVASRIRAMPOOR | కాల్వ శ్రీరాంపూర్ మే 2. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై 15 రోజులు గడిచినప్పటికీ సన్న వడ్లు మాత్రం ఇంకా తూకం వేయడం లేదని అధికారులు ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి సన్న వడ్లు కాంటాలు ప్రారంభం అయ్యే విధంగా చూడాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తిరుపతిరెడ్డి శుక్రవారం సందర్శించి కాంటాలు జరుగుతున్నాయా లేదా అని రైతుల అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా ఇంకా సన్న వడ్లు మాత్రం కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వమే యాసంగిలో సైతం సన్నవడ్లు సాగు చేస్తే బోనస్ ఇస్తామని ప్రకటించడంతో రైతులు పెద్ద మొత్తంలో సన్నవడ్లు సాగు చేశారని, పంట దిగుబడి కూడా బాగానే వచ్చిందన్నారు.
వారం రోజులుగా ఈదురుగాడుపులతో వర్షాలు వస్తున్నాయని పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, కలెక్టర్ వెంటనే స్పందించి సన్న వడ్లు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని త్వరితగతిన కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసే విధంగా చూడాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఆడేపు రాజు, కర్ణాకర్ ఇబ్రహీం, కుమార్ ,రమేష్, మల్లయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు.