Court | తిమ్మాపూర్, ఆగస్టు 24 : ఒకప్పుడు ఏదైనా సమస్య వస్తే గ్రామంలోనే పంచాయతీ పెట్టి పెద్ద మనుషుల సమక్షంలో సమస్య పరిష్కారం అయ్యేది. న్యాయమో.. అన్యాయమో ఎవరో ఒక్కరూ భరించుకుని విషయం క్లోస్ చేసుకునేవారు. పోలీస్ స్టేషన్లు, కోర్టులకు వెళ్లడం చాలా అరుదుగా ఉండేది. కాలం మారింది, ప్రజలకు న్యాయపరమైన విషయాల్లో విజ్ఞానం పెరిగింది.. దీంతో ఎలాంటి సమస్య వచ్చినా కోర్టులకు వెళ్లి పరిష్కరించుకుంటున్నారు. ఈ క్రమంలో కేసులు రోజు రోజుకు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. దీంతో కేసులు పెరిగి కోర్టులకు పనిభారం పెరిగి కేసులు పూర్తి కావడానికి చాలా సమయం పడుతున్నది. ఈ క్రమంలో కొత్త కోర్టుల ఏర్పాటు అవసరం ఉన్నది.
ఉమ్మడి జిల్లాలో ధర్మారంతోపాటు ఇటీవల ఓదెలలో కోర్టు ప్రారంభించిన నేపథ్యంలో మానకొండూర్ డివిజన్లో తిమ్మాపూర్ మండలంలో జూనియర్ బెంచ్ కోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వస్తున్నది.
ఏర్పాటు చేస్తే మెరుగైన సేవలు..
ఉమ్మడి రాష్ట్రంలో ఏదైనా కార్యాలయానికి వెళ్లాలంటే కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఏదైనా కేసు ఉన్నా, కలెక్టరేట్‌కు రావాలన్నా వచ్చి పోవడానికి ఉమ్మడి జిల్లాలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రజలకు సౌలభ్యమైన పరిపాలన అందజేయాలనే ఉద్దేశ్యంతో 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూతన జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు తోడ్పాటునందించారు. ఈ క్రమంలో పలు జిల్లాల్లో కోర్టులు విస్తరించి కక్షిదారులకు దూరభారం తగ్గేలా చేశారు. అలాగే కోర్టుల సంఖ్య పెరగడంతో సత్వర న్యాయం జరుగుతున్నది. ప్రస్తుతం మానకొండూర్ డివిజన్లో సైతం జూనియర్ మేజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రజల నుండి వస్తున్నది.
ఉమ్మడి జిల్లాలో ప్రధాన న్యాయస్థానం కరీంనగర్ కోర్టులో ఉండేది. జిల్లాలు ఏర్పాటైన కొన్నేళ్లకు ఏ జిల్లాకు ఆ జిల్లాలోని కోర్టుల్లో జిల్లా ప్రధాన న్యాయస్థానాలను ఏర్పాటు చేశారు. అలాగే సీనియర్ బెంచ్ న్యాయస్థానాలను సైతం ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలోని ధర్మారం, ఓదెల జూనియర్ కోర్టులను నూతనంగా ఏర్పాటు చేశారు. దీంతో మానకొండూర్ డివిజన్లో సైతం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. డివిజన్ పరిధిలో తిమ్మాపూర్, మానకొండూర్, గన్నేరువరం, చిగురుమామిడి మండలాలు ఉండగా తిమ్మాపూర్ మండలంలో తిమ్మాపూర్ నుండి నుస్తులాపూర్ వరకు ఎక్కడైనా ఏర్పాటు చేస్తే ఈ నాలుగు మండలాల కక్షిదారులకు దూర భారం తగ్గుతుందని చెబుతున్నారు.
తగ్గనున్న దూరభారం..
గన్నేరువరం, చిగురుమామిడి మండలాల ప్రజలు న్యాయసేవ కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే దూరభారం ఎక్కువ అవుతున్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం, అభివృద్ధి కోసం జిల్లాలు, మండలాలు, పంచాయతీలు ఏర్పాటు చేసినట్టే కోర్టులను సైతం ఏర్పాటు చేయాలని భావన స్థానిక ప్రజల్లో మెదులుతున్నది.
గతంలో ప్రపోజల్..
అయితే తిమ్మాపూర్ కోర్టు ఏర్పాటు చేయాలని ఇప్పుడే కాదు.. గతంలో అధికారికంగా సైతం ప్రపోజల్ వెళ్లినట్లు సమాచారం. తర్వాత ప్రభుత్వం మారడం, ఇతర కారణాలతో ఆ విషయం తెరపైకి రాలేదు. ప్రస్తుతం ఇటీవల కాలంలో కోర్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతున్నారు. పేద ప్రజలు చార్జీలు పెట్టుకుని కరీంనగర్ కోర్టుకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కోర్టుల సంఖ్య పెరిగితే సత్వత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.
ఏర్పాటైతే మేలు..
తిమ్మాపూర్ లో జూనియర్ కోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో మేలు జరగనున్నది. తిమ్మాపూర్ సర్కిల్ పరిధిలోని ఎల్ఎండీ, గన్నేరువరం, చిగురుమామిడి పోలీస్ స్టేషన్లతో పాటూ మానకొండూర్ పోలీస్టేషన్లలో కేసులు నమోదైన కక్షిదారులతో పాటూ పిటిషనర్లు, భూ వివాదంలో వాది, ప్రతివాదులు కోర్టులకు వెళ్లడానికి సులువు కానున్నది. అధికారులు తిమ్మాపూర్ కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Nepal | ఆగని ఆందోళనలు.. ఓలి రాజీనామాకు డిమాండ్.. మాజీ ప్రధాని ఇంటిని ధ్వంసం చేసిన నిరసనకారులు
BRS | రైతులకు సరిపడా యూరియా అందించండి.. కాల్వశ్రీరాంపూర్‌లో బీఆర్ఎస్ రాస్తారోకో
Aishwarya Rai | AIతో అశ్లీల కంటెంట్.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్య రాయ్