Vemulawada | వేములవాడ, ఆగస్టు 10: వ్యక్తిగత ప్రతిష్ట కోసం వేములవాడకు ఉన్న చరిత్రను కాల రాస్తున్నారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడ పట్టణంలోని పద్మశాలీ సంఘంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన రోజున చెప్పిన పనులు కాకుండా అధికారం మా చేతిలో ఉందని ఆగమ శాస్త్రం విరుద్ధంగా పనులు చేస్తున్నారని ఆరోపించారు. ముందుగా కేవలం స్వామి వారి కోటిలింగాలను మాత్రమే తొలగించి పనులు చేపడతామని చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు.
ఇప్పుడు స్వామివారి గర్భాలయం చుట్టూ స్లాబులతో నిర్మాణాలు చేపట్టిన అనంతరం స్వామి వారి గర్భాలయం గోపురం కేవలం రెండు అడుగులు మాత్రమే కనిపిస్తోందని దాని ఎత్తును పెంచుతూ గర్భాలయం విస్తీర్ణం కూడా పెంచేందుకు శృంగేరి పీఠాధిపతి వద్దకు వెళ్తున్నారన్నట్లు తమకు సమాచారం ఉందని అన్నారు. చేస్తున్న పనులకు ముందుగా అంచనాలు వేయగా ఆ రోజున గుర్తించని గర్భాలయం ఎత్తు, ఈరోజు ఎలా ముడతారని ప్రశ్నించారు. అసలు దేవాదాయ శాఖలో ఇంజనీరింగ్ విభాగం స్థపతి ఏం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చిన ప్రతీసారి రూ.వందల కోట్లు వస్తున్నాయని చెప్పడం మాత్రమే అని అసలు ఏ మేరకు పనులు జరుగుతున్నాయో ఎవరికీ కూడా తెలియకుండా అంతా రహస్యం చేపడుతున్నారని అన్నారు. కోట్లాది రూపాయలు కూడా దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని ఆగమశాస్త్ర విరుద్ధంగా జరుగుతున్న పనులను మాత్రమే తమ ప్రశ్నిస్తున్నామని చెప్పారు.
స్వామివారి పనులు 50 శాతం పూర్తయ్యాయని చెబుతుండగా అసలు ఏ మేరకు పనులు పూర్తయ్యాయో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక గుడి చెరువు కట్టపై దక్షిణ ముఖంలో శివుని విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని కూడా ఆయన ప్రశ్నించారు. ఎక్కడైనా తూర్పు లేదా ఉత్తరం వైపు మొఖం ఉండేలా చూస్తామని కానీ ఆగమశాస్త్ర విరుద్ధంగా పనులు నిర్వహిస్తున్నారని చెప్పడానికి ఇది నిదర్శనం అన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే బెంగాల్ ప్రజలు తిరస్కరించినట్లుగా కాంగ్రెస్ నాయకులకు తప్పదని ఆయన హెచ్చరించారు. శ్రావణమాసంలో స్థానిక భక్తులకు రాజన్న దర్శనాన్ని కల్పించాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు శ్రీధర్, రేగుల మల్లికార్జున్, కుమ్మరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.