కరీంనగర్ కలెక్టరేట్, డిసెంబర్ 24 : విశ్రాంత ఉద్యోగులు కన్నెర్రజేశారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన విరమణ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రేవా, తెలంగాణ పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. సర్కారు తీరుకు వ్యతిరేకంగా నినదించారు. పదవీ విరమణ ప్రయోజనాలు అందక తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అనేక మంది అనారోగ్యాల బారినపడుతున్నారని వాపోయారు. చికిత్స చేయించుకోలేక ఇప్పటివరకు రాష్ట్రంలో 36 మంది చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు, అనారోగ్య మరణాలు పెరగకముందే ప్రభుత్వం స్పందించాలని, గతేడాది ఏప్రిల్ నుంచి నేటి వరకు రిటైరైన ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్లో రేవా రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి మాట్లాడుతూ, ఇరవై ఒక్క నెలలుగా ఉద్యోగ విరమణ పొందిన వారికి జీపీఎఫ్, జీఐఎస్, లీవ్ ఎన్క్యాస్మెంట్, కమ్యూటేషన్, గ్రాట్యుటీ చెల్లింపులు చేయడం లేదని వాపోయారు. దీంతో పెన్షనర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈహెచ్ఎస్ అమలు కాక దవాఖానల్లో చెల్లించాల్సిన బిల్లులతో గుండె పోటు వచ్చి అనేక మంది మరణిస్తున్నా, కనీస కనికరం లేనట్లు వ్యవహరిస్తుండడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు పెన్షనర్స్ కుటుంబాలు కూడా పరోక్షంగా తోడ్పాటునందించాయనే వాస్తవాన్ని దాచిపెట్టి, తమపై కఠినవైఖరి అవలంభించడం దారుణమని మండిపడ్డారు. బడ్జెట్లో నిధులు కేటాయించి, ఇతర అవసరాలకు వినియోగించిన మొత్తాన్ని వెంటనే వెనక్కు తెప్పించి, పెన్షనర్లకు పంపిణీ చేయాలని సూచించారు.