ఆర్టీసీ నిర్వహణ గాడి తప్పింది. ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల పట్టింపులేమి ప్రయాణికులను అవస్థలపాలు చేస్తున్నది. బతుకమ్మ, దసరా పండుగను పురస్కరించుకొని సరిపడా బస్సులు నడిపించాల్సి ఉన్నా ప్రణాళికలోపం శాపంగా మారింది. శనివారం నుంచి కాలేజీలకు సెలవులు ఇవ్వగా, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కరీంనగర్ బస్టేషన్ కిక్కిరిసిపోయింది.
రద్దీ ఎక్కువగా ఉండే వరంగల్, గోదావరిఖని, మంచిర్యాల, నిజామాబాద్ రూట్లలో వెళ్లే ప్యాసింజర్స్ బస్సుల్లేక నరకం చూడాల్సి వచ్చింది. గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి దాపురించింది. ఎప్పుడో ఒక బస్సు వచ్చినా ఎక్కేందుకు కుస్తీలు పడుతూ, సీట్లు దొరక్క పడరాని పాట్లు పడడం కనిపించింది. హైదరాబాద్కు ఎక్స్ప్రెస్ బస్సులను తగ్గించి, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధానిలను నడిపించడం, ప్రధాన రూట్లలో బస్సులే లేకపోవడంపై ప్రయాణికులు మండిపడ్డారు. పండుగల సమయంలో ఇబ్బందులు పెట్టడం సరికాదని, అదనపు సర్సీసులు నడపాలని డిమాండ్ చేశారు.
– తెలంగాణచౌక్, సెప్టెంబర్ 20