కలెక్టరేట్, నవంబర్ 2: రాబోయే ఎన్నికల్లో ఓటు వేసేందుకు కొత్తగా నమోదు చేసుకునే వారి నుంచి అనూహ్య స్పందన వచ్చింది. చివరి విడుతగా ఎన్నికల సంఘం కల్పించిన అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుంది. స్పెషల్ సమ్మరి రివిజన్ 2023 కింద ఎన్నికల సంఘం పలు దఫాలుగా చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమంలో గత అక్టోబర్ 4 నాటికి 37 పైచిలుకు ఓటర్లు మాత్రమే నమోదు కాగా, గత నెల 5 నుంచి 31 వరకు తుది విడుతగా ఇచ్చిన అవకాశంతో 27 రోజుల్లో 28,834 మంది కొత్తగా ఓటు కోసం, చిరునామా మార్పుకు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనూహ్యంగా దరఖాస్తులు రాగా, కరీంనగర్ సెగ్మెంట్లో అత్యధిక సంఖ్యలో 14,449, హుజూరాబాద్‌లో 5,097, మానకొండూర్‌లో 4,633, చొప్పదండిలో 4,155 దరఖాస్తులు వచ్చాయి.
వీటిని ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. అక్టోబర్ 31 నాటికి ఓటరు నమోదు, చిరునామా మార్పుకు వచ్చిన దరఖాస్తులను ఈనెల 8 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిని గుర్తించి అర్హులైన వారితో కూడిన జాబితా తహసీల్ కార్యాలయాలకు పంపుతారు. అక్కడ అర్హులైన వారి వివరాలను ఎన్నికల సంఘం నిర్దేశించిన వెబ్సైట్లో అప్లోడ్ చేసిన అనంతరం ఈనెల 10న తుది జాబితా వెలువడనుంది. ఇప్పటికే జిల్లాలో 10,34,186 మంది ఓటర్లుండగా, తాజాగా వచ్చిన దరఖాస్తులతో మరో 25 వేల మంది కొత్త ఓటర్లుగా అనుబంధ జాబితాల్లో చేరే అవకాశాలున్నాయి.
పద్దెనిమిదేళ్లు నిండిన వారంతా ఓటు హక్కు నమోదుపై గతంలో నిర్లక్ష్యంగా ఉండేవారు. అయితే, ఈసారి ఎన్నికల సంఘం చేపట్టిన పలు రకాల ప్రచారం, విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసిన అవగాహన శిబిరాలు సత్ఫలితాలిచ్చాయి. జిల్లాలోని పద్దెనిమిదేళ్లు నిండిన వారిలో చైతన్య పవనాలు వీచాయి. మొబైల్ ఫోన్ ద్వారా కూడా ఓటు నమోదు చేసుకునే విధంగా సరళమైన పద్ధతిని ప్రవేశపెట్టడంతో వేలాది మంది తమ స్మార్ట్ ఫోన్ నుంచే ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించుకున్న మేరకు ఓటరు నమోదు కార్యక్రమం విజయవంతమైనట్లేనని, ఇక వంద శాతం పోలింగ్‌పై దృష్టి సారిస్తున్నట్లు జిల్లా ఎన్నికల యంత్రాంగం పేర్కొంటున్నది.