చిగురుమామిడి, జూలై 6: చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామంలోని నాలుగో వార్డులో పదిరోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొన్నది. సరిపడా నీరు సరఫరా చేయాలని పలుసార్లు గ్రామ పంచాయతీలో సమాచారం ఇచ్చినప్పటికీ.. శాశ్వత పరిషారం చూపడంలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నీటిఎద్దడి తీవ్రం కావడంతో ‘తాగునీరు అందించండి మహాప్రభో’.. అంటూ ఆదివారం ఉదయం ఖాళీబిందెలతో మహిళలు నిరసన తెలిపారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
ఈ విషయమై జీపీ కార్యదర్శి స్వప్నను సంప్రదించగా, తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రత్యామ్నాయంగా ట్రాక్టర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. త్వరలో సమస్యకు శాశ్వత పరిషారం చూపుతామన్నారు. నిరసన వ్యక్తం చేసిన వారిలో రంగు పద్మ, పైడిపల్లి రేణుక, మల్లవ్వ తదితరులు ఉన్నారు.