Ramagundam | కోల్ సిటీ , జూన్ 7: రామగుండం నగర పాలక సంస్థ డివిజన్ల పునర్విభజనకు సంబంధించి వెలువడిన ముసాయిదా (డ్రాఫ్ట్ నోటిఫికేషన్)పై తాజాగా మరో ప్రచారం తెరపైకి వచ్చింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఆశాస్త్రీయ పద్ధతిలో జరగడంతోనే ఓటర్ల గల్లంతైనట్లు నిన్నటివరకు ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ తాజాగా మరో ప్రచారం దుమారం రేపుతోంది. ముసాయిదా వెలువడటానికి రెండు రోజుల ముందే టౌన్ ప్లానింగ్ విభాగంలోని ఓ అధికారి రామగుండం ఎన్టీపీసీలోని ఓ ప్రముఖ హోటల్లో ఓ రాజకీయ పార్టీ నేత మంతనాలు సాగించినట్లు ఆ పార్టీ వర్గాలే బాహాటంగా మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది.
ఇంతకీ ఆ హోటల్లో సదరు మాజీ ప్రజాప్రతినిధితో ఆ టౌన్ ప్లానింగ్ అధికారి ఎందుకు చర్చలు జరపాల్సి వచ్చిందనేది, ఒకవేళ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తమకు అనుకూలంగా తయారు చేయాలని ఏమైనా చెప్పి ఉంటారా? అన్న ప్రచారం వినబడుతోంది. కాగా, ముసాయిదా వెలువడిన రోజునే ‘నమస్తే తెలంగాణ’లో ‘ఒక్కరోజులోనే ఏలా సాధ్యమైంది..’ అన్న శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీంతో నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసీ) జే అరుణ శ్రీ స్పందించి వెంటనే వార్డు ఆఫీసర్లతో అత్యవసర సమావేశమైంది. మరుసటి రోజు నుంచి క్షేత్ర స్థాయిలో భౌగోళిక హద్దులను పరిగణలోకి తీసుకొని ఇంటింటికి వెళ్లి శాస్త్రీయంగా సర్వే చేయాలని ఆదేశించారు.
కానీ, ఇప్పటివరకు ఏ ఒక్క డివిజన్లో కూడా ఇంటింటా సర్వే జరగడం లేదు. ఇదిలా ఉండగా అక్కడ సదరు రాజకీయ నాయకుడు తయారు చేసిన స్కిట్ ఆధారంగానే ఈ ముసాయిదా తయారు చేశారా? అని పలువురు బాహాటంగా చర్చించుకుంటున్నారు. టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాలు సదరు రాజకీయ నాయకుడు చెప్పిన విధంగానే నడుచుకుంటున్నట్లు ఇప్పటికే బోలెడన్నీ ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయి. కాగా, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పూర్తిగా రాజకీయ నాయకుల కోసమే తయారు చేశారనీ, ప్రధానంగా దళితుల ఓటర్లనే గల్లంతు చేశారనీ, సరిహద్దు, భౌగోళిక అంశాలు పరిగణలోకి తీసుకోకుండా ఒక గదిలో కూర్చొని తయారు చేశారని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ ఇదివరకే కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తాజా ఆరోపణలో ఎంతవరకు వాస్తవం ఉందనేది నివృత్తి కావాల్సి ఉంది.