Sanitation workers | పెద్దపల్లి, మే3: మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికుల పని తీరు మరింత మెరుగు పడాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పారిశుద్య కార్మికులకు బట్టులు (దుస్తులు), ఈఎస్ఐ కార్డులు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పట్టణ పరిశుభ్రత కోసం పాటు పడుతున్న పారిశుద్య కార్మికుల పని తీరు అభినందనీయమని, కానీ పురపాలిక పరిధిలో అక్కడక్కడ అపరిశుభ్రత నెలకొందని పేర్కొన్నారు.
రోడ్ల వెంట చెత్తాచెదారం ఉంటుందని, డ్రైనేజీలు క్లిన్ చేయటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. పట్టణాన్ని శుభ్రంగా ఉంచటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అలాగే వేసవి దృష్ట్యా పట్టణంలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా ఏర్పడి కాలనీలో తాగునీటి సమస్య ఉందని, వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ నల్లా ద్వారా ప్రతి ఇంటికి సురక్షితమై తాగునీరందించాల్సిన బాధ్యత మున్సిపాలిటీపై ఉందని గుర్తు చేశారు.
కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్, ఏఈ సతీష్, నాయకులు మల్లయ్య, మస్రత్, శ్రీకాంత్, శ్రీమాన్, బొడ్డుపల్లి శ్రీమాన్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.