కలెక్టరేట్, మే 3: వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించాలంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివచ్చి, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోదీ, అమిత్‌షాకు వ్యతిరేకంగా నినదించారు.
అనంతరం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. లాబోర్డు జిల్లా శాఖ ప్రతినిధి ముఫ్తియూనుస్ మాట్లాడుతూ, వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేసేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక చట్టంపై చేసిన ఆందోళనల స్ఫూర్తితో వక్ఫ్ వ్యతిరేక చట్టంపై కూడా తాము దీర్ఘకాల ఆందోళనలు కొనసాగిస్తామని వెల్లడించారు.
ముస్లింల ఆస్తులు కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసే క్రమంలోనే నల్లచట్టాలను తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ర్యాలీలో ఎంఐఎం నాయకుడు అబ్బాస్ షమీ, సున్నీ మర్కజి మిలాద్ కమిటీ సభ్యుడు సయ్యద్ మొయిజుద్దీన్, ఖాద్రీయూసుఫ్, ముస్లిం పర్సనల్ లాబోర్డు జిల్లా కన్వీనర్ హపీజ్ రిజ్వాన్, గుత్తేదారు కమాలొద్దీన్, బీఆర్ఎస్ నాయకుడు జమీలొద్దీన్, హఫీజ్ వసీమొద్దీన్, గులాం రబ్బానీ ఖాద్రి, తదితరులు పాల్గొన్నారు.