స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై అస్పష్టతకు తెరపడకపోవడంతో ఆశావహులు ఊగిసలాటలో కొట్టుమిట్టాడుతున్నారు. ముందుకు వెళ్లాలా..? కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూద్దామా..? అన్న మీమాంసలో ఊగిసలాడుతున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో కోర్టులో నిలువదంటూ ఇప్పటికే న్యాయనిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో అన్ని పార్టీల్లోనూ గందరగోళం నెలకొన్నది. ఇదే సమయంలో పలు జాతీయ పార్టీలకు చెందిన పలువురు నాయకులు.. టికెట్ మీకేనంటూ ఆశలు రేపుతున్నారు. ఇదే అదనుగా టికెట్ ఇప్పిస్తామంటూ దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కోర్టు 42 శాతం రిజర్వేషన్లకు ఓకే చెప్పకపోతే.. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించినవి మినహా రిజర్వేషన్లు భారీగా తారుమారయ్యే అవకాశమున్నది. ఈ పరిస్థితుల్లో రిజర్వేషన్లు గతంలో మాదిరిగా 50 శాతానికి మించకుండా ఉండేలా సైతం ఒక జాబితాను జిల్లా అధికార యంత్రాగం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. అయితే, ప్రస్తుతం అస్పష్టత నెలకొన్న నేపథ్యంలో అధికార పార్టీ చేస్తున్న హడావుడి, ఎన్నికల్లో తమకు శరాఘాతంగా మారుతుందని ఆయా పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
కరీంనగర్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అధికార పార్టీ కాంగ్రెస్.. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జీవో ఇచ్చి హడావుడి చేస్తున్నా.. అది న్యాయస్థానాల్లో నిలబడే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గతంలోనే ఈ విషయంపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. నిజానికి 2019 జనవరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలోనే పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని తేల్చిచెప్పింది. ఆ మేరకు 2011 జనాభా లెక్కల ఆధారంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను అప్పటి పంచాయతీరాజ్ అధికారులు ఖరారు చేశారు. అప్పుడు బీసీలకు 22.79 శాతం, అలాగే ఎస్సీలకు 20.53 శాతం, ఎస్టీలకు 6.68 శాతం చొప్పున రిజర్వేషన్లు కేటాయించారు. దాని ప్రకారమే ఎన్నికలు నిర్వహించారు. అప్పట్లో వివిధ రాష్ర్టాల్లో వివిధ పద్ధతుల్లో సర్పంచ్ ఎన్నికలు జరిపారు.
అంతేకాదు, చాలా రాష్ర్టాల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చారు. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రతి రాష్ట్రంలోనూ డెడికేటెడ్ కమిషన్ (మన రాష్ట్రంలో బీసీ కమిషన్) నియమించాలని అప్పుడే సూచించింది. ఆ కమిషన్ పూర్తి అధ్యయనం చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు ఇవ్వాలని చెబుతూనే, అన్ని కలిపి రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని అప్పుడే స్పష్టం చేసింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్‌రావు ఆధ్వర్యంలో కమిషన్ బృందం దేశంలోని కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాల్లో పర్యటించింది. అక్కడ స్థానిక సంస్థల రిజర్వేషన్లను అధ్యయనం చేసింది.
వివిధ రాష్ర్టాల్లో వివిధ పద్ధతుల్లో రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తించింది. కొన్ని రాష్ర్టాలు ఏకంగా ఇంటింటా బీసీ కులగణన చేసి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసినట్టు గమనించింది. మరికొన్ని రాష్ర్టాల్లో ఓటరు జాబితా ఆధారంగా బీసీల సంఖ్యను గుర్తించి, రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని పరిశీలించింది. కమిషన్ ఈ విషయాన్ని ప్రభుత్వానికి చేరవేసింది. ఈలోగా అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో ఆ పక్రియ అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ బీసీ కులగణన చేయడంతోపాటు ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీలో తీర్మానం చేస్తూ గవర్నర్ ఆమోదం కోసం పంపింది.
కానీ, ఆ ఫైలు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నేరుగా జీవో జారీ చేసింది. అంటే తాజా జీవో ప్రకారం చూస్తే.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు అవకాశం కల్పించింది. గతంలో మాదిరిగానే ఎస్సీలకు 20.53 శాతం, ఎస్టీలకు 6.68 శాతం ఇచ్చింది. ఈ మూడు వర్గాలకు కలిపి చూస్తే.. 69.21 శాతానికి రిజర్వేషన్ పెరుగుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను పరిశీలిస్తే 50 శాతానికి మించొద్దు. అంటే దాదాపు 19.21 శాతం విరుద్ధంగా పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నారని పేర్కొంటూ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఈనెల 8న దానిపై విచారణ ఉన్నది. ఈ పరిస్థితుల్లో న్యాయనిపుణుల అభిప్రాయం ప్రకారం.. సుప్రీంకోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటించాలంటూ హైకోర్టు సైతం ఆదేశాలు ఇవ్వడానికే 99 శాతం అవకాశం ఉన్నది.
2109లో రాష్ట్ర ఎన్నికల సంఘం వివిధ దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించిన విషయం తెలిసిందే. రాజ్యాంగంలోని 243(3)(ఏ) ఆర్టికల్ ప్రకారం పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికలను ఐదేళ్ల పదవీకాలం ముగిసేలోపే నిర్వహించాల్సి ఉంటుందని గతంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నది. అంతేకాదు, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 14(2) ప్రకారం ముఖ్యంగా గ్రామ పంచాయతీ పాలకవర్గ పదవీకాలం ముగియడానికి మూడు నెలల్లోగా ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.
అయినా వివిధ కారణాల వల్ల రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అవుతూ వచ్చాయి. కాగా, ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినా.. రిజర్వేషన్ల ఖరారుపై నెలకొన్న అస్పష్టత ఆశావహులను ఊగిసలాటకు గురిచేస్తున్నది. ప్రస్తుతం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీచేయగా, ఆ ప్రకారంగా అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. అయితే 42 శాతం రిజర్వేషన్ అంశం ప్రస్తుతం కోర్టులో పెడింగ్‌లో ఉన్నది.
ఈ విషయంపై ఈ నెల 8న స్పష్టత రావడానికి ఆస్కారం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా హైకోర్టు కూడా ఆదేశాలు ఇస్తే 2019 ఎన్నికల మాదిరిగానే 50 శాతం రిజర్వేషన్లకు లోబడి ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. ఆదే జరిగితే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అలానే ఉంటాయి. కానీ, బీసీ రిజర్వేషన్ల శాతం మాత్రం ప్రభుత్వం చెబుతున్న 42 శాతం కాకుండా.. 22.79 శాతానికి తగ్గే అవకాశముంటుంది. అంటే ప్రస్తుతం కేటాయించిన 42 శాతంలో 19.21 శాతం తగ్గుతుంది. ఇది అమల్లోకి వస్తే అప్పుడు ఓసీ జనరల్, ఓసీ మహిళా రిజర్వేషన్లు పెరుగుతాయి. పెరిగే ఓసీ రిజర్వేషన్లు ఎక్కడ వస్తాయన్నదానిపై క్లారిటీ ఎవరికి లేదు.
42 శాతం ప్రకారంగా కేటాయించిన ఎంపీటీసీలు, జడ్పీటీసీల్లో ఏవి ఓసీ జనరల్, మహిళా అవుతాయో తెలియని పరిస్థితి ఉండగా, ఆశావహులంతా మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ముందుకు వెళ్లాలా.. వద్దా..? అన్న ఆంశంపై తమ తమ సన్నిహితులతో మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు రిజర్వేషన్లపై అస్పష్టత ఉండగా.. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో దళారులు రంగ ప్రవేశం చేశారు. స్థానిక సంస్థల్లో టికెట్ మీకే ఇప్పిస్తామంటూ ఆశలు రేపుతున్నారు. అక్కడితో ఆగకుండా ఒక్కో పదవికి ఒక్కో ధర నిర్ణయించారన్న చర్చ ప్రస్తుతం జాతీయ పార్టీల్లో నడుస్తున్నది. ఎంపీటీసీగా గెలిస్తే ఎంపీపీ ఇప్పిస్తామని, జడ్పీటీసీగా గెలిస్తే జడ్పీ చైర్మన్‌ను చేస్తామంటూ బేరసారాలు ఆడుతున్నారన్న చర్చ నడుస్తున్నది. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడితే తీరా ఎన్నికల సమయంలో ఈ బేరసారాలు ఏమిటన్న ఆందోళన ఆయా పార్టీల్లో కనిపిస్తున్నా, ఇప్పటికిప్పుడే బయట పడకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తున్నది.