Journalists | కరీంనగర్ కలెక్టరేట్, డిసెంబర్ 27: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం మొదటిసారి జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు జారీ చేసేందుకు విడుదల చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 143 జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన లోప భూఇష్టమైన జీవోతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది జర్నలిస్టులకు తీవ్ర నష్టం వాటిలనున్న నేపథ్యంలో, ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఛలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొని, పాత్రికేయుల హక్కులను కాలరాసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుండటాన్ని తూర్పార బట్టారు.
ప్ల కార్డులు ప్రదర్శిస్తూ కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. రెండు కార్డుల విధానాన్ని ప్రవేశపెడుతూ, డెష్క్, ఫీల్డ్ జర్నలిస్టులను విభజించే కుట్రకు తెరలేపారని ధ్వజమెత్తారు. అక్రిడిటేషన్ మంజూరు విధానంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం , గౌరవాన్ని దెబ్బతీయటమేనని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ , దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 23,000 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లో మంజూరు చేశారని గుర్తు చేశారు. జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించడం మానుకొని, గత జీవోను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో జర్నలిస్టుల ఆగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు నాయకులు కే ప్రకాష్ రావు, వేణుగోపాల రావు, టీయూడబ్ల్యూజే 143 జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణ, డెస్క్ జర్నలిస్టులు సుభాష్, శ్రీనివాస్, పలు పత్రికల డెస్క్ జర్నలిస్టులు, న్యూస్ ఛానల్, ప్రింట్ మీడియా ప్రతినిధులు, జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన 100 మందికి పైగా జర్నలిస్టులు పాల్గొన్నారు.