కుర్మపల్లె భయం గుప్పిట్లో బతుకుతున్నది. గ్రామానికి సమీపంలోనే స్టోన్ క్వారీ, క్రషర్ ఉండగా, బ్లాస్టింగులతో దద్దరిల్లుతున్నది. పేలుళ్ల దాటికి పెద్ద పెద్ద బండరాళ్లు ఎగిరి వస్తూ పొలాలు, జనసంచారం ఉండే ప్రాంతాల్లో పడుతుండగా, ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాల్సిన దుస్థితి ఉన్నది. మరోవైపు పాత ఇండ్లు కూలిపోతుండగా, కొత్త నిర్మాణాలు పగుళ్లు బారుతుండడం పరిస్థితికి అద్దం పడుతున్నది. ఇదేంటని ప్రశ్నించిన తమను నిర్వాహకులు బెదిరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. బ్లాస్టింగులు ఆపాలని సంబంధిత అధికారులతోపాటు కలెక్టర్, హైదరాబాద్‌లో మైనింగ్ కమిషనర్‌ను కలిసి విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.
పెద్దపల్లి, జూలై 2(నమస్తే తెలంగాణ) : జూలపల్లి మండలం పెద్దాపూర్ పంచాయతీ పరిధిలోని కుర్మపల్ల్లె చిన్న గ్రామం. దాదాపుగా 78 ఇండ్లు ఉండగా, 350మంది జనాభా ఉన్నది. పచ్చని గ్రామంలో కొన్నేండ్ల కింద కొందరు స్టోన్ క్వారీ, క్రషర్ ఏర్పాటు చేసి కుంపటి పెట్టారు. మొదట ఇద్దరు వ్యక్తులు ఈ వ్యాపారాన్ని కొనసాగించారు. అయితే పేలుళ్ల వల్ల పంటలు పండడం లేదని గుర్తించి, క్వారీ సమీపంలో పొలాలున్న రైతులకు ప్రతి ఏడాది ఎకరాకు 10వేల నుంచి 15వేలు ఇచ్చి ఈ వ్యాపారాన్ని కొనసాగించారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఈ క్రషర్‌ను చొప్పదండికి చెందిన వ్యక్తి పూర్తిగా స్వాధీనం చేసుకొని వ్యాపారం చేయడం మొదలు పెట్టగా, అప్పటి నుంచే గ్రామస్తులకు ఇబ్బందులు మొదలయ్యాయి. సమీపంలోని పొలాలకు ఇచ్చే పరిహారం ఎగ్గొట్టాడు. ఆ కొన్నాళ్లకే రాజకీయ అండదండలతో చిన్న చిన్నగా స్టోన్ క్వారీని తవ్వడం మొదలు పెట్టి, ఆ తర్వాత ఏకంగా ఎక్స్‌ప్లోజివ్స్ వాడడం ప్రారంభించాడు.
చిన్న చిన్నగా మొదలైన ఈ పేలుళ్లు భారీ స్థాయికి వెళ్లాయి. పేలుళ్ల తీవ్రతను పెంచడం, క్రషర్ నడపడం, నిత్యం పదుల సంఖ్యలో వాహనాల్లో రవాణా చేయడంతో గ్రామస్తులకు ఇక్కట్లు పెరిగాయి. నిత్యం పేలుళ్లతో బెంబేలెత్తుతున్నారు. పేలుళ్ల దాటికి గ్రామంలోని పాత ఇండ్లు కూలడం, కొత్త ఇండ్లు పగుళ్లు తేలడంతో భయంతో వణికిపోతున్నారు. అంతేకాదు క్వారీ, క్రషర్కు దారి లేకపోవడంతో నిర్వాహకులు రైతులను భయపెట్టి పట్టా భూముల నుంచే దర్జాగా రోడ్డు వేసుకున్నాడని, ఇదేంటని ప్రశ్నిస్తే ఇది ప్రభుత్వ భూమి అని సర్వేల పేరిట కాలయాపన చేస్తూ రైతులపైనే ఏకంగా కేసులు పెట్టించారని వాపోతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన అనుమతులు లేకుండా క్వారీ, క్రషర్ నిర్వహించడమే కాదు ఎక్స్‌ప్లోజివ్స్ విక్రయాలు చేపడుతున్నాడని ఆరోపిస్తున్నారు.
పెద్దాపూర్‌లోని వెంకటేశ్వర స్టోన్ క్వారీ, క్రషర్కు సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయి. అక్కడ బ్లాస్టింగ్స్ కూడా చట్టబద్ధంగానే జరుగుతున్నాయి. నూతన విధానంలో బ్లాస్టింగ్స్ చేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండే అవకాశం లేదు. చాలా సార్లు వెళ్లి చూశాం. నిబంధనలకు లోబడే ఉన్నది.
నాకు గ్రామంలో ఇరవై ఎకరాల భూమి ఉన్నది. క్వారీ బ్లాస్టింగులు చేయవట్టి పొలం పనికి ఎవరూ వస్తలేరు. పంటలు పండిచ్చుకోకుంట అయితంది. ఎప్పుడు ఏ బండ వచ్చి పడుతదో అనే భయంతోనే బతుకుతున్నం. ఈ పేలుళ్లకు పాత ఇల్లు పూర్తిగా కూలింది. కొత్త ఇల్లు కట్టుకున్నం. అది కూడా పర్రెలు పాస్తున్నది. మమ్ముల ఎవరు కాపాడుతరు. నడి ఊళ్లె ఈ క్వారీ, క్రషర్ పెట్టి బ్లాస్టింగ్లతో సచ్చిపోతన్నం. దయ చేసి ప్రభుత్వం మమ్ముల ఆదుకోవాలే.
గ్రామంలో దాదాపు వంద ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. వరి, పత్తి, మామిడి పండిస్తున్నారు. పేలుళ్ల కారణంగా పంట పొలాల్లో పనులు చేయలేకపోతున్నారు. ఎప్పుడు ఏ రాయి వచ్చి తమ తలపై పడుతుందోనని వణుకుతున్నారు. వ్యవసాయ కూలీలు పనులంటేనే వామ్మో అంటున్నారు. దీంతో చేసేదేమి లేక రైతులు ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. క్వారీ, క్రషర్ వెదజల్లే దుమ్ము కారణంగా పంటలు సైతం సరిగ్గా రావడం లేదని వాపోతున్నారు.
జనావాసాలకు దగ్గరగా పేలుళ్లు, బ్లాస్టింగులు జరుగుతున్నాయని, నిర్వాహకులు దౌర్జన్యం చేస్తున్నారని గ్రామస్తులు ఇప్పటికే పలు సార్లు కలెక్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాకపోవడంతోహైదరాబాద్లోని ప్రజాభవన్‌కు వెళ్లి మైనింగ్ కమిషనర్‌ను కలిశారు. తమ గోడు వెల్లబోసుకున్నా ప్రయోజనం లేకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా, రాష్ట్ర అధికారులు తమ గ్రామాన్ని సందర్శించి అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీ, క్రషర్, ఎక్స్‌ప్లోజివ్స్ వ్యాపారం నుంచి తమను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
కుర్మపల్లిలో నిర్వహిస్తున్న స్టోన్ క్వారీలో పరిమితికి మించి తవ్వకాలు చేపడుతున్నారనే విమర్శలున్నాయి. ఒకే చోట రెండు క్వారీలు నిర్వహిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా మైనింగ్ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. క్వారీపై ఎవరు ఎలాంటి ఫిర్యాదులు చేసినా.. వాటిపై చర్యలు తీసుకోకుండా తన రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తున్నారని విమర్శిస్తున్నారు. ‘మీరు ఎక్కడికి వెళ్లినా.. ఎవరికి ఏం చెప్పుకున్నా మాకేం కాదు. మా క్వారీని ఎవ్వరూ మూయలేరు. ఎక్స్‌ప్లోజివ్స్ వ్యాపారాన్ని ఎవరూ అడ్డుకోలేరు’ అని బెదిరిస్తున్నారని వాపోతున్నారు.
క్వారీ, క్రషర్ నిర్వహకుడు నా భూమిలో నుంచే అక్రమంగా రోడ్డేసిండు. నా పట్టా భూమిల రోడ్డు ఎలా వేస్తారని అడిగిన. రోడ్డును కందకం తీసి మూసేస్తే నాతోపాటు మరికొంత మందిపై కేసులు పెట్టించిండు. ఆ కేసు ఎటూ ముందుకు పోతలేదు. ఈ క్వారీ, క్రషర్ మూసేయాలని కలెక్టర్లకు ఎందరికి చెప్పినా పట్టించుకుంటలేరు. హైదరాబాద్‌కు వెళ్లి మైనింగ్ కమిషనర్‌ను కలిసినం. ఎలాంటి అనుమతులు లేవని చెప్పిన్లు. కానీ ఎవరూ వచ్చి మూసేస్త లేరు. ఏ పర్మిషన్లు లేకున్నా నడిపిస్తున్నడు.
మాకేందీ ఈ తిప్పల? మేం ఎందుకు ఇట్ల చావాలే. పేలుళ్ల తోటి ఇంట్ల ఉండలేకపోతున్నం. మొన్న మంచంల ఇంట్ల పన్నోన్ని పేలుడుకు కింద వడ్డ. బయటికి ఉరికచ్చిన. ఇల్లు కూలుతదనుకున్న. ఇంట్ల పండాల్నంటేనే భయం అయితంది. ఆడ బాంబు పేలినప్పుడు ఈడ దద్దరిల్లుతంది. గిట్ల ఇండ్ల నడుమ పెట్టి మమ్ముల గోస వెడుతండు. ఊరుకు ఊరు పోయి కలెక్టర్‌కు చెప్పినా ఇక్కడికి ఎవలు రాలే. మేము మా పిల్లలు బతికినంత కాలం ఈ భయం భయంగానే బతకాలా..? దయ చేసి క్వారీ, క్రషర్లను మూసి 80కుటుంబాలను కాపాడాలే.