Singareni | గోదావరిఖని : సింగరేణి కి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.47 వేల కోట్ల బకాయిలు వెంటనే ఇవ్వాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ లు డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో వారు గురువారం మాట్లాడారు. సింగరేణి కి చెందిన బొగ్గు విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం కు చెందిన విద్యుత్ సంస్థలు వాడుకొని రూ. 47 వేల కోట్ల బకాయిలు పడ్డారని, వాటిని ఇంత వరకు సింగరేణి కి చెల్లించకపోవడంతో సంస్థ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా తయారైందిని వారు తెలిపారు. దీనివల్ల సంస్థ లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయాయని, ముఖ్యంగా కార్మికుల కు ప్రతి నెలా వేతనాలు చెల్లింపులకు సంస్థ బ్యాంకు నుండి అప్పులు చేసి ఇవ్వడం జరుగుతుందని వారు పేర్కొన్నారు.
సంస్థ లో యంత్రాలు పాత బడి మూలకు పడుతున్నాయని, డబ్బులు లేక కొత్త మిషనరీ కొనుగోలు చేయడం లేదని, దీని వల్ల పాత యంత్రాలతో బొగ్గు ఉత్పత్తి చేయడం వల్ల అనేక ప్రమాదాలు జరిగి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. సంస్థ కు కొత్త గనులు వస్తేనే మనుగడ కొనసాగుతుందని, లేకుంటే సంస్థ భవిష్యత్తులో కొనసాగడం కష్టమని, కొత్త గనులు ప్రైవేటు కు ఇవ్వకుండా సింగరేణి కి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంస్థ కు శాశ్వత మైన సీఅండ్ఎండీ, డెరైక్టర్ ఫైనాన్స్ ను నియమించక పోవడం వల్ల గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో యాజమాన్యం అంగీకరించిన డిమాండ్ లపై అమలు కోసం సర్క్యులర్ జారీ కాకా కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని వారు పేర్కొన్నారు. సంస్థ కు శాశ్వతమైన సీఅండ్ఎండీ, డైరెక్టర్ ఫైనాన్స్ ను నియమించి సమస్యల ను పరిష్కరించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మారుపేర్లు, విజిలెన్స్ కేసుల సమస్య, మెడికల్ బోర్డు ను నిర్వహించక పోవడం, సొంత ఇంటి పథకం అమలు, పెర్క్స్ పై ఇన్ కం టాక్స్ యాజమాన్యం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని వివిధ సమస్యల ను పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కి వినతి పత్రం ఇచ్చి నెలలు గడిచినా ఇంత వరకు పరిష్కారం చూపకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని వారు ఆరోపించారు. సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం, కార్మికుల సంక్షేమం కోసం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తప్ప ఇతర పార్టీల కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చట్ట సభల్లో మాట్లాడకపోవడం విచారకరమని వారు పేర్కొన్నారు. సింగరేణి లో మితిమీరిన రాజకీయ జోక్యం వల్ల సంస్థ దివాలా తీసే పరిస్థితి ఉందని వారు ఆరోపించారు.
గుర్తింపు సంఘం కాలపరిమితి 2026 సెప్టెంబర్ వరకు ఉన్న విషయం తెలిసి కొన్ని కార్మిక సంఘాలు కార్మికులను తప్పు దోవ పట్టిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ సమావేశంలో అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, ఉప ప్రధాన కార్యదర్శులు కే సారయ్య, కందికట్ల వీరభద్రయ్య, మడ్డి ఎల్లా గౌడ్, ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం, నాయకులు సంకె అశోక్, సిర్ర మల్లికార్జున్, ఎంఏ గౌస్, ఆజీం పాషా, పర్లపెల్లి రామస్వామి, ఏవీఎస్ ప్రకాశ్, పెద్దెల్లి శంకర్, నంది నరేష్, మడ్డి కిరణ్, జనగామ జగదీశ్వర్, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.