అకాల వర్షాలతో నష్టపోయిన కర్షకుడికి రాష్ట్ర సర్కారు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఇప్పటికే గత నెలలో వడగండ్లతో పంట దెబ్బతిన్న రైతులకు ఎకరాకు 10వేల పరిహారం ప్రకటించి సీఎం కేసీఆర్ అభయమివ్వగా, తాజాగా కల్లాలు, కేంద్రాల్లో తడిసిపోయిన ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రత్యేక చొరవ తీసుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు కేటాయించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మరోపక్క వరుస వర్షాలతో ఆరబోసిన ధాన్యం ఎండే పరిస్థితి కనిపించకపోవడంతో తేమ శాతాన్ని 17 నుంచి 20కి పెంచాలని ఎఫ్‌సీఐకి ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని చెప్పారు. కరీంనగర్ జిల్లాలోని 59 మిల్లులకు 15 వేల టన్నుల ధాన్యాన్ని కేటాయింపు జరిగిందని మంత్రి వివరించారు.
– కరీంనగర్, మే 2 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, మే 2 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాల కారణంగా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గత నెల 24 నుంచి ప్రతి రోజూ ఏదో ఒక చోట, ఒక్కో రోజు జిల్లా మొత్తంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. వడగండ్లు కురిసి వే లాది ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. ఉన్న పంటను కోసి ధాన్యం ఆరబెట్టుకుందామని రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాస్త ఎండ వచ్చినా ఆరబెట్టుకుంటున్నారు. చినుకుపడే ముందే టార్పాలిన్లు కప్పుతున్నారు. ఇంత చేసినా ధాన్యం తడుస్తూనే ఉన్నది. వేలాది ఎకరాల్లో పంట రాళ్లపాలుకాగా, చేతికి వచ్చిన ధా న్యం వాన పాలవుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభు త్వం రైతన్నలకు అండగా నిలబడింది. చేళ్లలో నష్టపోయిన పంటకు ఎకరానికి 10 వేల పరిహారం చెల్లిస్తామని సీఎం కేసీఆర్ రామడుగులో పర్యటించినప్పుడు ప్రకటించారు. ఆ మేరకు మార్చిలో కురిసిన వడగండ్ల కారణంగా 8,116.11 ఎకరాల్లో పంటలు కోల్పోయిన 9, ట445 మంది రైతులకు రూ. 8.16 కోట్ల నష్ట పరిహారం విడుదల చేశారు. ఏప్రిల్‌లో జరిగిన నష్టాన్ని మూడు సార్లు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనిపై పూర్తి స్థాయి సర్వే జరుగుతుండగా, పూర్తయిన తర్వాత రైతులను గుర్తించి పరిహారం విడుదల చేసే అవకాశమున్నది.
తడిసిన ధాన్యం కొనాలని..
వడగండ్లు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లిస్తూనే, తడిసిన ధాన్యాన్ని కొని రైతులకు అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా శరవేగంగా కొనుగోళ్ల ప్రక్రియను నిర్వహిస్తున్నది. ఇప్పటికే అనేక మంది రైతుల ధాన్యం ఇటు కేంద్రాల్లో అటు కల్లాల్లో తడిసి, మొలకలు వచ్చే పరిస్థితి కనిపిస్తున్నది. వరుస వర్షాల కారణంగా ధాన్యంలో తేమ శాతం తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఇటు రైతులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి మద్దతు లభించడం లేదు. గతంలో మాదిరిగా యాసంగిలో బాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్ అయితేనే తీ సుకుంటామని ఎఫ్‌సీఐ అధికారులు తేల్చి చెప్పా రు. ప్రస్తుత పరిస్థితుల్లో తడిసిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం 17 శాతం తేమ ఉంటే బాయిల్డ్ రైస్‌గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నష్టం విపరీతంగా జరిగిన ప లు జిల్లాల బాయిల్డ్ మిల్లులకు తడిసిన ధాన్యాన్ని కేటాయించాలని నిర్ణయించింది. ఈ విధంగా కరీంనగర్ జిల్లాలోని 59 మిల్లులకు 15 వేల ట న్నుల తడిసిన ధాన్యాన్ని తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా వరుస వర్షాలతో ధాన్యం ఆరడం లేదని, తేమ శాతాన్ని 17 నుంచి 20 వరకు మినహాయించుకోవాలని రాష్ట్ర ప్రభు త్వం ఎఫ్‌సీఐని కోరిందని మంత్రి గంగుల తెలిపారు. ఈ మినహాయింపును ఎఫ్‌సీఐ అంగీకరిస్తే రైతులకు మరింత ఊరట లభించనుంది.
కొనుగోళ్లు స్పీడప్
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లా లో 21,168.824 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నా రు. సోమవారం వరకు 15,414.140 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా మంగళవారం ఒక్క రోజే 5,743.040 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఆపై వెంటవెంటనే మిల్లులకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 20, 628.400 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించినట్లు అధికారు లు తెలిపారు. ఈ రోజు వరకు ఇంకా 340.724 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కేంద్రాల్లో ఉంది. అకాల వర్షం కారణంగా అధికారులు ఎప్పటికపుడు తీసుకుంటున్న చర్యలకు ఇది నిదర్శనంగా చెప్పవచ్చు.
రైతులూ ఆందోళన వద్దు
తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్రానికి వచ్చిన ప్రతి ధాన్యపు గింజనూ కొంటాం. తడిసిన ధాన్యం ఉంటే ఆరబెట్టుకుని 17 శాతం తేమ వచ్చిన వెం టనే కేంద్రాలకు తెచ్చి విక్రయించుకోవాలి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ కింద వాడుకోవాలని మిల్లర్లకు సైతం ఆదేశాలు ఇచ్చాం. మిల్లర్లు కూడా సహకరిస్తున్నారు. వరుస వర్షాలు కురుస్తున్నందున తేమ శాతం కొంత మినహాయించి తీసుకోవాలని ఎఫ్‌సీఐ అధికారులను రాష్ట్ర ప్రభు త్వం కోరింది. మినహాయింపు వస్తే రైతులకు మరింత ఊరట లభిస్తుంది. జిల్లాల్లో ఎక్కడ బాయిల్డ్ మిల్లులకు అవకాశం ఉంటే అక్కడికి తడిసిన ధాన్యాన్ని తరలించాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. ధాన్యం తడిసిందని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా.
– గంగుల కమలాకర్, రాష్ట్ర మంత్రి