కోల్సిటీ, మార్చి 18: ‘రింగుడు బిల్లా రూపాయి దండా.. దండకాదురా దామెర మొగ్గ..’ ‘ఆ గుండు ఈ గుండు ఇత్తడి గుండు.. గుండువోయి గండి మీద మోతలు వెట్టె..’ ‘కోతిపుట్టుడెందుకు.. కొమ్మలెక్కెతందుకు..’ ‘ఎల్లిరన్న బుల్లికోడె.. నాలగంధం పూసుకోని..’ ‘మల్లే చెట్టు కిందికెళ్లి మదానో నావయ్యారి..’ అంటూ వెన్నెల వెలుగుల్లో జాజిరి ఆటలు మొలయ్యాయి.హోలీ పండుగకు ముందు మొదలయ్యే జాజిరి కొత్త సందడిని తీసుకువస్తుంది.
తొమ్మిది రోజులపాటు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా.. కులమతాలకతీతంగా ఆడుకునే కాముడి ఆటలతో ప్రతి వీధీ హోరెత్తుతుంది. మగ పిల్లలు కోలలతో.. ఆడ పిల్లలైతే చప్పట్లతో పసందైన పాటలు పాడుతూ.. ఇంటింటికీ తిరుగుతూ.. ఆడుతోంటే మార్మోగుతుంది. తొమ్మిది రోజులపాటు సేకరించిన వడ్లు, మక్కలు, బియ్యం వంటివి ఆఖరి రోజు షావుకారి దగ్గర అమ్మడం.. వచ్చిన డబ్బులతో తెల్లవారి హోలీ జరుపుకోవడం మజానిస్తుంది.