కరీంనగర్ కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 5 : ఉపాధ్యాయులు మార్గనిర్దేశకులని, సమాజంలో వారి సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కొనియాడారు. విద్యార్థులకు తల్లిదండ్రుల కంటే గురువుతోనే ఎకువ అనుబంధం ఉంటుందని పేర్కొన్నారు. గురువుల సూచనలు పాటించి విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్యాదవ్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థులు ఇంటిలో కంటే పాఠశాలలోనే ఎకువ సమయం గడుపుతారని తద్వారా గురువుతో అనుబంధం పెరుగుతుందన్నారు.
అనంతరం కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, పిల్లలందరూ పాఠశాలకు వచ్చేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందన్నారు. కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి సొంత డబ్బులతో పిల్లలకు ఐడీ కార్డులు, టై, బెల్ట్ వంటి వస్తువులు కొనిస్తున్నారని, పాఠశాలలోని చిన్నచిన్న మరమ్మతులు చేయిస్తున్నారని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అనంతరం జిల్లాలోని 44 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్ధన్ రావు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
మెరుగైన డ్రైనేజీ వ్యవస్థతో వరద నీరు ఆగలే
వారం రోజులుగా వర్షాల కారణంగా పలు జిల్లాల వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కానీ, కరీంనగర్ వాసులు మాత్రం ప్రశాంతంగా ఉన్నారని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. దీనికి గత ప్రభుత్వం ఆధ్వర్యంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చడం ప్రధాన కారణమన్నారు. గతంలో వర్షం పడితే ఎక్కడ నీరు ఆగుతుందోనని భయం ఉందేదని, కానీ బీఆర్ఎస్ హయాంలో ఆ సమస్యలను పరిష్కరించుకున్నామని గర్వంగా చెప్పారు.