server down | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 12: వివిధ అవసరాల కోసం కావాల్సిన ధ్రువీకరణ పత్రాలకు సర్వర్ డౌన్ సమస్య అడ్డంకిగా మారింది. మూడు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న మీ సేవా కేంద్రాల్లో ఇవే ఇబ్బందులు ఎదురవుతుండగా, ఆదాయ, కుల, స్థానికత నిర్ధారణతో పాటు ఇతర ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తులు చేసుకున్న వేలాది మంది అనేక అవస్థలు పడుతున్నారు.
సాంకేతిక సమస్యలను గంటల వ్యవధిలోనే పరిష్కరించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుండడంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సౌలభ్యమే లక్ష్యంగా పారదర్శక సేవలందించే క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 550 వరకు మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. సాధారణంగా ఒక్కో జిల్లాలో రోజుకు దాదాపు 1,200 నుంచి 1,500దాకా వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తులు వస్తుంటాయి. ప్రధానంగా రెవెన్యూ శాఖ ద్వారా అందించే ఆదాయ, కుల, నివాస, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలే కీలకమైనవి. ఉప కార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు పలు విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఇతర ప్రవేశాల కోసం ప్రాథమికంగా మీ సేవా కేంద్రాల్లోనే సమర్పించాల్సి ఉంటుంది. ఇటీవల నిరుద్యోగులకు స్వయం ఉపాధి పథకాలు సబ్సిడీపై అందిస్తామంటూ ప్రకటించింది.
ఈ నెల 14 వరకు తుది గడువు కూడా విధించింది. దీంతో, తమకు లబ్ధి చేకూరుతుందేమోననే ఆశతో వేలాది మంది నిరుద్యోగులు దశరఖాస్తులు చేసుకుంటున్నారు. మీ సేవా కేంద్రాల ఎదుట బారులు తీరుతున్నారు. అసలే ఎండాకాలం, ఆపై ఒకేసారి వేలసంఖ్యలో దరఖాస్తుదారులు వెబ్సైట్ ఓపెన్ చేస్తుండగా, మీ సేవా కేంద్రాల్లో తరచుగా సర్వర్లు పని చేయడం లేదు. గడువు సమీపిస్తుండగా ఎప్పటికప్పుడు ధరఖాస్తుదారుల సంఖ్య పెరుగుతుండగా, సర్వర్ సతాయింపు ఆగటం లేదు. దీంతో దరఖాస్తుదారులకు సమాధానం చెప్పలేక, విధిలేని పరిస్థితుల్లో మీ సేవా కేంద్రాలు మూసివేస్తున్నారు.
గంటల వ్యవధిలోనే పరిష్కారం చూపాల్సిన అధికారులు చేతులెత్తేస్తున్నారు. అయితే మూడు రోజుల నుంచి కేంద్రాలు మొత్తమే పని చేయక పోవడంతో ధ్రువీకరణ పత్రాలు కోసం ధరఖాస్తులు చేసుకున్న వేలాది మంది ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వానికి నిత్యం కోట్లలో నష్టం వస్తున్నా పట్టించుకోకపోవడంపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు. సర్వర్ సమస్యతో ఇప్పటివరకు కనీసం దరఖాస్తు చేసుకునే అవకాశం లభించకపోవడంతో తాము స్వయం ఉపాధి పథకాలు పొందేందుకు అర్హత పొందుతామో.. లేదోననే దిగులు ధరఖాస్తుదారుల్లో మొదలైంది. సర్వర్ సమస్య పరిష్కారం కాకుంటే ప్రత్యా మ్నాయంగా ధ్రువీకరణ పత్రాలు అందించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.