కోల్సిటీ, జూన్ 2 : విప్లవాల గని.. గోదావరిఖనిలో తెలంగాణ అమరవీరుల త్యాగాలకు అవమానం జరిగింది. సకల జనుల సమ్మెకు పురుడు పోసి.. ఉద్యమాల పురిటిగడ్డగా పేరున్న ఇక్కడ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు అమరవీరుల స్తూపం కనీసం అలంకారానికి నోచుకోలేదు. దీంతో స్తూపం బోసిపోయింది. స్వరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల ఆత్మఘోష గొల్లుమన్నది. అమరవీరుల త్యాగాలకు ఇదేనా విలువ అంటూ రామగుండం నగర పాలక సంస్థ అధికారుల తీరుపై పలువురు ఉద్యమకారుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంటే వారం రోజుల ముందుగానే వారోత్సవాలను పండుగలా జరుపుకునే ఆనవాయితీ ఉండేది. కానీ, ఇప్పుడు నిరాడంబరంగా జరపడం, కనీసం స్తూపాన్ని పూలతో అలంకరించేందుకు కార్పొరేషన్లో పైసలు లేవా..? అంటూ ఉద్యమకారులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వరాష్ట్రం కోసం కొట్లాడి..లాఠీ దెబ్బలకు ఎదురునిలబడి.. పోరాడి ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఇచ్చే గౌరవం ఇదేనా..? అని మండిపడ్డారు.