Development of society | కోరుట్ల, సెప్టెంబర్ 8: సమాజాభివృద్దిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని కోరుట్ల ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు ఆవార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి భావి భారత సమాజ నిర్మాతలని పేర్కొన్నారు.
విద్యార్థులను సన్మార్గంలో నడిపించడంలో ఉపాధ్యాయుల కృషి అభినందనీయమన్నారు. ఉపాధ్యాయులు బోధించే ప్రతి విషయాన్ని విద్యార్థులు శ్రద్ధగా ఆలకించి సమాజ శ్రేయస్సుకు తమవంతు సహకారమందించాలని ఎంపీడీవో సూచించారు. అనంతరం మండలస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 13 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి గంగుల నరేష్ చేతుల మీదుగా అవార్డులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గంగాధర్, నల్ల భూమయ్య, జ్యోత్స్న, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.