SP Ashok Kumar | కోరుట్ల, నవంబర్ 15: నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్ ను మెట్పల్లి డీఎస్సీ రాములుతో కలిసి ఎస్సీ ప్రారంభించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆధునిక యుగంలో నేరాల నియంత్రణ, కేసుల ఛేదన, ప్రజా భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాల వినియోగం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పోలీసింగ్ వ్యవస్థ మరింత సమర్ధవంతంగా మారుతుందన్నారు. ప్రజల రక్షణకు, నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాలు అమూల్యమైన సాధనాలని, ప్రతి వీధిలో కెమెరాలు అమర్చడం వలన నేరం జరిగిన వెంటనే నేరస్తులను గుర్తించడం, నిందితులను పట్టుకోవడం సులభతరం అవుతుందన్నారు. కెమెరాలు పోలీసులకు మూడవ నేత్రమని నేరాలు జరగకుండా ముందుగానే హెచ్చరికగా పనిచేస్తాయని చెప్పారు.
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరస్తులు నేరం చేయడానికి వెనుకడుగు వేసే అవకాశం ఉందన్నారు. ప్రజలు తమ గృహలు, వ్యాపార సంస్థలకు, అపార్ట్ మెంట్లకు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే వ్యక్తిగత భద్రతతో పాటు సమాజ భద్రత కూడా బలోపేతం అవుతుందన్నారు. ప్రత్యేకంగా ప్రధాన రహదారులు, క్రాస్ రోడ్లు, బిజీ సెంటర్లు, మార్కెట్ ఏరియాల్లో కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అవసరమౌతుందన్నారు. కోరుట్లలో 123 కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వారిని ఎస్పీ అభింనందించారు. కార్యక్రమంలో కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్ఐలు చిరంజీవి, రాంచంద్రం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.