రాజన్న సిరిసిల్ల, జూన్ 22 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తున్నది. రూ.91 లక్షల విలువైన ధాన్యం అక్రమంగా అమ్ముకోవడం, ఏడుగురిపై కేసు నమోదు కావడం, అందులో అధికార పార్టీ నాయకులు ఉన్నట్టు ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపుతున్నది. ఇటు కోనరావుపేట మండలంలోనూ మూడు వడ్ల లారీలు మాయం కావడం ఎన్నో అనుమానాలకు తావిస్తున్నది. ఈ నేపథ్యంలో అధికారులు, పోలీసులు లోతుగా ఆరా తీస్తుండడంతో అక్రమార్కుల్లో వణుకు పుడుతున్నది.
ఇదే సమయంలో వరుస ఘటనలను కలెక్టర్ సీరియస్‌గా తీసుకున్నారు. ధాన్యం అక్రమ తరలింపుపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌ను ఆదేశించారు. విచారణ నివేదిక రాగానే .. తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వ ధాన్యం అక్రమ తరలింపు కేసులో రిమాండ్‌కు వెళ్లిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కే రాజశేఖర్‌ను విధులను తొలగిస్తూ సోమవారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
మరొకరు రిమాండ్
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడిన మరొకరిని రిమాండ్‌కు తరలించినట్టు సిరిసిల్ల పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. రుద్రంగి మండలానికి చెందిన గడ్డం నర్సారెడ్డి.. అపారెల్ పార్క్ గోదాం లో పనిచేస్తున్న విజయ్‌కుమార్, గణేశ్‌తో కలిసి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారు. గోదాముల్లో నిల్వలకు సంబంధించి లెక్కలు సరిగా గుర్తించడం కష్టమనే విషయాన్ని ఆసరాగా చేసుకున్నారు.
రైతుల పేరిట నకిలీ ట్రక్ షీట్లను సృష్టించి గోదాముల్లో ధాన్యం చేరినట్టు ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 5న 378క్వింటాళ్లు, 9న 316క్వింటాళ్ల ధాన్యం పంపినట్టు నకిలీ చిట్టీలు రూపొందించారు. రైతుల ఖాతాల్లో ప్రభుత్వ నిధులు జమ కాగా, రైతులను మభ్యపెట్టి నగదు వసూలు చేశారు. అందులో కొంత మొత్తాన్ని సహ నిందితులకు బదిలీ చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, సోమవారం గడ్డం నర్సారెడ్డిని రిమాండ్‌కు తరలించారు. అతడి నుంచి రూ.4లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
లారీల మాయంపై విచారణ!
కోనరావుపేట, జూన్ 22: ‘మూడు వడ్ల లారీల మాయం’పై పోలీసులు ముమ్మర విచారణ చేపట్టినట్టు సమాచారం. కోనరావుపేట, కొలనూర్ సింగిల్ విండో కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, సిబ్బంది, అధికారుల నుంచి వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో లారీ డ్రైవర్లను కూడా విచారించగా, తాము పెద్దూరు అపారెల్ పార్లోనే ధాన్యాన్ని అన్లోడ్ చేశామని, అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించినట్టు సమాచారం. మరోవైపు జిల్లా సివిల్ సప్లయి అధికారులు కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తున్నది. అయితే కొనుగోలు కేంద్రాల వద్ద సరైన పర్యవేక్షణ లేకపోవడం, ధాన్యం రవాణాలో నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.