పెద్దపల్లి, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ సర్కారు ‘2 మిల్చ్ ఆనిమల్ యూనిట్’ పథకాన్ని రూపొందించింది. షెడ్యూల్ క్యాస్ట్ యాక్షన్ ప్లాన్ (ఎస్సీఏపీ) 2020-21 పథకం కింద ఒక్కో ఎస్సీ కుటుంబానికి 2 గేదెలను అందిస్తే, ఆ కుటుంబం ఆర్థిక ప్రగతిని సాధిస్తుందని భావించింది. ఆ మేరకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ స్కీం ప్రారంభించింది. పెద్దపల్లి, సిరిసిల్ల, సిద్ధిపేట, జనగాం, నాగర్‌కర్నూల్, సూర్యపేట, జగిత్యాల జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసింది. ఆ సమయంలో కొంత మేరకు గేదెల పంపిణీ జరిగింది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నవ్వుల పాలవుతున్నది. పెద్దపల్లి జిల్లాలో డిసెంబర్ చివరి వారం నుంచి గేదెల పంపిణీని తిరిగి ప్రారంభించగా, ఇదే అదునుగా దళారులు గోల్మాల్ చేస్తున్నారు.
కొందరు అధికారుల సహకారంతో పర్చేజ్ లేకుండా.. పంపిణీ లేకుండా సరికొత్త దందాకు తెరలేపారు. లబ్ధిదారులను వలలో వేసి బాగోతం నడిపిస్తున్నారు. ‘ఈ స్కీం ద్వారా గేదెలను కొంటే 6 నుంచి 9 నెలల వరకు వాటికి మేత పెట్టి మేపాలి. అలా చేసినా ఈత తర్వాత మాత్రమే పాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంత రిస్క్ తీసుకునే దానికంటే.. తాము చెప్పినట్టు వింటే ఇప్పటికిప్పుడు లాభపడొచ్చు’ అని ఆశ చూపి వలలో వేస్తున్నారు. లబ్ధిదారుడికి కలిగే ప్రయోజనం కన్నా తమకే ఎక్కువగా ప్రయోజనం కలిగేలా చూసుకుంటున్నారు. ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి 2లక్షల వరకు లబ్ధి కలుగనుండగా, కేవలం 35 వేల నుంచి 50 వేల వరకు వచ్చేలా చేస్తున్నారు. దీని వల్ల లక్ష్యం నెరవేరకపోగా, వల్ల లబ్ధిదారులు కూడా నష్టపోతున్నారు.
సబ్సిడీ ఇలా..
2 మిల్చ్ ఆనిమల్ యూనిట్ కాస్ట్ 2 లక్షలు కాగా, ప్రభుత్వం 1.40 లక్షలు సబ్సిడీ ఇస్తున్నది. మిగతా 60 వేలు బ్యాంకు రుణంగా అందిస్తున్నది. ఈ యూనిట్‌ను 5 విభాగాలుగా చెల్లిస్తున్నారు. అందులో ఆనిమల్ కాస్ట్, ఇన్సూరెన్స్, రవాణా చార్జీలు, మెడిసిన్స్, ఫీడ్‌గా లబ్ధిదారులకు అందిస్తున్నారు.
ఫొటోలకే ఫోజులు.. పంపిణీ ఓ డ్రామా
..ఈ ఫొటోలో కనిపిస్తున్నవి హుజూరాబాద్ నుంచి మంథని మండలం గద్దలపల్లి గ్రామానికి తీసుకొచ్చిన గేదెలు. వాటిని కిందికి దింపి ఇక్కడ ఇద్దరు లబ్ధిదారులకు ఇచ్చినట్టు ఫొటోలు తీసి తిరిగి వాపస్ పంపించారు. తర్వాత లబ్ధిదారుడి ఖాతాలో డబ్బులు జమయ్యాయి. కానీ, లబ్ధిదారుడి ఇంటి వద్ద మాత్రం గేదెలు లేవు.
.. ఈ ఫొటోలో కనిపిస్తున్నది మంథని మండలం గోపాల్పూర్ గ్రామానికి పంపిణీ కోసం తీసుకువచ్చి తిరిగి తీసుకువెళ్తున్న గేదెలు. గ్రామంలో లబ్ధిదారుడికి ఇచ్చినట్టు ఫొటోలు తీసి తిరిగి అక్కడి నుంచి హుజురాబాద్‌కు తీసుకొని వెళ్లారు. తీరా లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి చూస్తే గేదెలు లేవు.
అంతా అడ్డదారే!
ప్రభుత్వం ఏర్పాటు చేసిన పర్చేజింగ్ కమిటీ ద్వారా లబ్ధిదారులు మేలు రకమైన పాడి గేదెలను ఎంపిక చేసుకోవాలి. వెటర్నరీ డాక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అధికారి, బ్యాంకు రిప్రజంటేటివ్తో కలిసి లబ్ధిదారుడు తమిళనాడు, హర్యానా రాష్ర్టాలకు వెళ్లాలి. అక్కడ లొకేషన్లో గేదెను ఎంపిక చేసుకున్నట్టుగా ఫొటో దిగాలి. ఆ తర్వాత వాటిని తీసుకొని ఇక్కడకు రావాలి. వచ్చిన తర్వాత కూడా ఇంటి వద్ద ఫొటో దిగాలి. ఇలా చేసినప్పుడే ప్రభుత్వం బ్యాంకు ద్వారా నేరుగా చెల్లిస్తుంది. కానీ, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో అడ్డదారులు తొక్కుతున్నట్టు తెలుస్తున్నది. బ్రోకర్ల కనుసన్నల్లోనే దందా జరుగుతున్నట్టు వెలుగులోకి వస్తున్నది. నిజానికి కొంత మంది లబ్ధిదారులు నిబంధనల ప్రకారమే మేలు రకమైన గేదెలను కొనుగోలు చేసి తీసుకొస్తున్నా, మరికొంత మంది మాత్రం బ్రోకర్ల మాటలతో పక్కదారి పడుతున్నారు. గేదెల ఎంపిక కోసం తమిళనాడు లేదా హర్యానాకు వెళ్లి అక్కడి లొకేషన్లో ఫొటో దిగుతున్నా.. తర్వాత గేదెలు తెచ్చుకోవడం లేదు. ఒక బ్రోకర్ ద్వారా హుజూరాబాద్ నుంచి గేదెలను తెప్పించుకొని ఫొటోలు దిగి, ఆ తర్వాత అదే వాహనంలోనే గేదెలను పంపిస్తున్నట్టు తెలిసింది.
పంపిణీ లేకుండానే..
జిల్లాలో 457 యూనిట్లను ఎంపిక చేయగా, 122 యూనిట్లకు గ్రౌండింగ్ జరిగింది. అయితే, ఈ గేదెల పంపిణీలో అంతా గోల్మాల్ జరుగుతున్నది. గేదెలను తెచ్చుకోకున్నా.. తెచ్చుకున్నట్టుగానే కథ నడుస్తున్నది. లబ్ధిదారుడు 90 వేలు ముట్టచెప్తే చాలు ఎవరికీ అనుమానం రాకుండా బాగోతం నడిపిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇతర రాష్ర్టాలకు వెళ్లి వచ్చిన తర్వాత ఓ బ్రోకర్ ఒక వాహనంలో గేదెలను ఇంటికి తీసుకొచ్చి, ఇక్కడ పంపిణీ చేసినట్టు ఫొటోలు దిగిపిస్తాడు. ఆ తర్వాత ఆ గేదెలను అదే వాహనంలో తీసుకొని వెళ్తాడు. అంటే ఇక్కడ పర్చేజ్ లేదు.. పంపిణీ లేదు. లబ్ధిదారుడు స్కీం కింద ఎంపికై, ఆయనకు డబ్బులు ఖాతాల్లో జమైనా ఇంట్లో మాత్రం గేదెలు ఉండడం లేదు. పంపిణీ అంతా రికార్డుల్లోనే కనిపిస్తుండగా, బ్రోకర్ల దందాలో పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నట్టు తెలుస్తున్నది. లబ్ధిదారుడికి వచ్చే 2 లక్షల్లో రూ.60 వేలు బ్యాంకు అప్పు పోను, మిగిలిన 90 వేలు మధ్యవర్తికి, అధికారులకు కలిపి ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. మిగతా 50 వేలలో స్థానికంగా గ్రామంలో యూనిట్ల ఎంపిక కోసం సహకరించిన బ్రోకర్లకు సైతం కొంత డబ్బును ఇస్తున్నట్టు తెలుస్తున్నది. 10 వేల నుంచి 15వేల వరకు ఇచ్చుకుంటే చివరాఖరుకు అసలైన లబ్ధిదారుడికి 30 వేల నుంచి 35 వేల వరకే మిగులుతున్నది.
తీవ్ర విమర్శలు
2 మిల్చ్ ఆనిమల్ స్కీం ద్వారా ఎంపికైన లబ్ధిదారుడు ఆ తర్వాత ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరో ఏ పథకం వచ్చినా ఐదేండ్ల వరకు ఎంపికయ్యే అవకాశం ఉండదు. అయితే, ఇక్కడ మిల్చ్ ఆనిమల్ స్కీం ద్వారా 2 లక్షలకు బదులుగా 30 వేల నుంచి 35 వేల వరకే ప్రయోజనం కలుగుతుంది. వాస్తవంగా చూస్తే లబ్ధిదారులు గేదెలను తీసుకొంటే ఉపాధి దొరుకుతుంది. రోజువారీగా వచ్చే డబ్బులతో కుటుంబానికి ప్రయోజనం కలుగుతుంది. కానీ, ఈ పథకం ఇలా దుర్వినియోగం కావడం వల్ల అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. బ్రోకర్లు సాగిస్తున్న ఈ దందాలో అధికారుల పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా కండ్ల ముందే జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అక్రమాలకు తావులేకుండా పంపిణీ చేస్తున్నాం
2మిల్చ్ ఎనిమల్ యూనిట్ల పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పంపిణీ చేస్తున్నాం. పూర్తిగా లబ్ధిదారులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడా అక్రమాలు జరిగినట్టు నా దృష్టికి రాలేదు. ఏవైనా దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
-కే నరేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ (పెద్దపల్లి)