కలెక్టరేట్, మే 31 : పని ప్రదేశాల్లో మహిళలకు వేధింపుల నుంచి రక్షణ కల్పించే ప్రివెన్షన్ ఆఫ్ ద సెక్సువల్ హరాష్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్‌ప్లేస్ 2013 చట్టం జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు వేధింపులు తప్పడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ చట్టం ప్రకారం పది మందికి పైగా ఉద్యోగులు పనిచేసే ప్రతి సంస్థలో అంతర్గత ఫిర్యాదు కమిటీ తప్పనిసరి ఏర్పాటు చేయాలి.
అయితే, జిల్లాలో ఇప్పటివరకు 349 కమిటీలు మాత్రమే ఏర్పాటు కావడం ఈచట్టం అమలు తీరును తేటతెల్లం చేస్తుందనే చర్చ నడుస్తున్నది. పని ప్రదేశాల్లో వేధింపులకు గురయ్యే మహిళలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంలో వెనుకడుగు వేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సంస్థల్లోనే ఫిర్యాదులు స్వీకరించి, బాధితులకు రక్షణ కల్పించేందుకు పోష్ చట్టం కీలకంగా మారింది. మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని మహిళా సాధికారత కేంద్రం ఈ చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచనలు చేస్తున్నప్పటి, అమలు మాత్రం అంతంత మాత్రమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అసంఘటిత రంగాల్లో కమిటీలేవి?
ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్‌తో పాటు అసంఘటిత రంగాలైన బ్రిక్స్ తయారీ, రైస్‌మిల్స్, నిర్మాణ రంగంతో పాటు పలు చిన్న పరిశ్రమల్లో కూడా అయిదుగురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మహిళా ఉద్యోగులకు ఫిర్యాదు చేసే అవకాశాలు, హక్కులపై సమాచారం అందించే బోర్డులు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ, జిల్లాలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పెద్ద ప్రైవేటు సంస్థలు, షాపింగ్ మాల్స్ వరకే ఈ కమిటీల ఏర్పాటు పరిమితమైనట్లు తెలుస్తున్నది. వాస్తవానికి అసంఘటిత రంగాల్లో పనిచేసే వారే ఎక్కువగా వేధింపులకు గురయ్యే ప్రమాదముండగా, అక్కడ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో మహిళలు ఉంటారు. కానీ, అలాంటి చోట్లనే కమిటీల ఏర్పాటు కనిపించడం లేదు.
ఆయాచోట్ల కూలీలు నిత్యం పనిచేసే అవకాశాలుండకపోవడం, సంబంధిత శాఖల నుంచి కఠినమైన ఆదేశాలు ఇవ్వకపోవడం, యజమానుల్లో అవగాహన లేకపోవడం కూడా కమిటీల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తున్నది. పోష్-2013 చట్టం అమలు చేయని సంస్థలపై జరిమానా విధించే నిబంధనలు ఉన్నప్పటికీ, వాటి అమలులో నిర్లక్ష్యం కొనసాగుతుందని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు చట్టపరమైన రక్షణ అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ప్రతి సంస్థలో కమిటీ ఏర్పాటు పర్యవేక్షించడం, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తేవడం ద్వారా మాత్రమే మహిళలకు సురక్షితమైన పని వాతావరణం కల్పించే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు మహిళా ఉద్యోగులు, కార్మికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.