Chigurumamidi ponds | చిగురుమామిడి, సెప్టెంబర్ 12 : చిగురుమామిడి మండలంలో గురువారం రాత్రి కోసిన భారీ వర్షానికి కుంటలు, చెరువులు నిండాయి. పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. పలు ఇళ్లలోకి, పాఠశాలకు, దేవాలయాల్లో నీరు చేరాయి. ఇందుర్తి ఎల్లమ్మ వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఇందుర్తి నుండి కోహెడ వెళ్లే ప్రధాన రహదారి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
అటువైపుగా వెళ్లకుండా అధికారులు కంచ ఏర్పాటు చేశారు. ఓగులాపూర్ నుండి మండల కేంద్రానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రేకొండ నుండి మొగిలిపాలెం వెళ్లే రహదారి కల్వర్టు వద్ద వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో శుక్రవారం రాకపోతే నిలిచిపోయాయి. గాగిరెడ్డిపల్లి లోని బోల్లోని పల్లెలో కెనాల్ కాలువ తెగి ఊరిలోకి నీరు రావడంతో ఇళ్లలో నీళ్లు చేరాయి. సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వరద నీరు చేరడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ఇందుర్తి ప్రభుత్వ పాఠశాలలో నీరు చేరడంతో తహసీల్దార్ రమేష్, ఎంపీడీవో మధుసూదన్, ఎంపిఓ రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. రామంచలోని దేవుని చెరువు, కొత్త కుంట, నాగుల చెరువు, అమ్మ చెరువుల నుండి మత్తడి పడడంతో ఊరు చివర ఇండ్ల పక్కన ఉన్న దర్గా నుండి ఉధృతంగా వరద నీరు ప్రవహించింది. పలు పంటలు నీట మునిగాయి. మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహించడంతో ప్రజలు అటువైపుగా వెళ్లేందుకు సాహసించడం లేదు.
ఇందుర్తి కోహెడ మధ్య ఎల్లమ్మ వాగు గురువారం రాత్రి నుండి ఉధృతం కావడంతో సమాచారం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్, ఎస్సై సాయికృష్ణ తోపాటు మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్, స్థానిక మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అందే సురేష్ పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించారు.
దీంతో మంత్రి ఆదేశాలకు రాత్రి వాగు వద్దకు చేరుకొని కంచెను ఏర్పాటు చేశారు. ముల్కనూర్ ఊర చెరువు , గాగిరెడ్డిపల్లి సంగోజి చెరువు అలుగులు పరవళ్ళు తొక్కుతోంది. గ్రామ ప్రత్యేక అధికారి, మండల పరిషత్ సూపరింటెండెంట్ ఖాజామోహినుద్దీన్ నీటి పరిస్థితిని పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని గ్రామపంచాయతీ సిబ్బందికి ఆదేశించారు.