SIRICILLA | సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 18: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ వెంగళ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం మంజూరు చేయాలని, ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని, ఉద్యమకారులందరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు. తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి రూ.25వేల పింఛన్ మంజూరు చేయాలని, అలాగే సంక్షేమ బోర్డు ద్వారా రుణాలు అందించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల లో తెలంగాణ ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్న ఇంతవరకు ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈనెల 21 వ తేదీన హైదరాబాద్ లో ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఫ్లీనరీకి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరణ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నియోజకవర్గ అధ్యక్షులు వెంగల శ్రీనివాస్, ఉద్యమకారుల పోరం రాష్ట్ర నాయకులు ఆకునూరి శంకరయ్య, వి భాస్కర్, కందుకూరి రామ గౌడ్, వెంగళ లక్ష్మణ్, మామిడాల రమణ, బింగి ఇజ్జగిరి, పోరండ్ల రమేష్, సిరిపురం గంగారాజం, వేముల చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.