Vemulawada | వేములవాడ, మార్చి 17: వేములవాడ నియోజకవర్గంలో బీజేపీ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. గడిచిన 2023 అసెంబ్లీ ఎన్నికలలో వేములవాడ నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ చెన్నమనేని వికాస్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడిగా రాజకీయ అరంగేటం చేశారు. అయితే విద్యాసాగర్ రావు శిష్యుడు ప్రతాప రామకృష్ణ ప్రస్తుతం వికాస్ రావును విభేదిస్తూ ఏడాదిగా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది.
వేములవాడలో ఆయనకు పట్టు లేకుండా చేసేందుకు ప్రతాప రామకృష్ణ ప్రయత్నం చేస్తూ నాయకులను కట్టడి చేస్తున్నారు. అయితే గడిచిన మున్సిపల్ ఎన్నికల్లో రామకృష్ణ తన అనుకూల వర్గానికి టికెట్లను కేటాయించడమే కాకుండా గెలుపులో కూడా కీలకంగా వ్యవహరించారు. దీంతో ఆయన తన వర్గీయులపై పట్టు సాధిస్తుండగా తాజాగా మరోసారి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ బయటపడింది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా డాక్టర్ చెన్నమనేని వికాస్ ను పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే జిల్లా పార్టీ అధ్యక్షుడు గోపి ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో మంగళవారం పెద్ద ఎత్తున సన్మాన సభను ఏర్పాటు చేశారు.
నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరికి పిలిచి వేడుకను నిర్వహించారు. అయితే ఈ వేడుకకు వేములవాడ పట్టణానికి చెందిన 8 మంది కౌన్సిలర్లతో పాటు బీజేపీ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కూడా గైర్హాజరయ్యారు. ఆయన అనుచర వర్గం దాదాపు పది మంది దాకా పార్టీ నాయకులు కూడా ఎవరు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో సన్మాన సభ జరిగిన ప్రధానంగా 8 మంది పార్టీ కౌన్సిలర్లు ఉన్న సభకు హాజరు కాకపోవడం ఇప్పుడు ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఏది ఏమైనా కొంతకాలంగా జరుగుతున్న కోల్డ్ వార్ ప్రస్తుతం వేములవాడలో హాట్ టాపిక్ గా మారింది.