ఇప్పుడే పత్తి కొనుగోళ్లు జరిపే పరిస్థితి లేదని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులు తేల్చి చెబుతున్నారు. మొదటి పికింగ్‌లో పత్తి తమ నిబంధనల ప్రకారం ఉండడం లేదని చెబుతున్నారు. వారం కింద జమ్మికుంట మార్కెట్లో తెరిచిన సీసీఐ కేంద్రంలో కేవలం 60 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే, రెండోసారి సేకరించే పత్తి మాత్రమే కాస్త సీసీఐ నిబంధనల మేరకు ఉంటుందని, అప్పుడే కొనుగోళ్లు ప్రారంభిస్తామని సీసీఐ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ట్రేడర్లు అడిగిన ధరకు రైతులు విక్రయించుకుంటుండగా, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రైతులకు అందకుండా పోతోంది.
కరీంనగర్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని విక్రయించుకునేందుకు రైతులు మునుపెన్నడూ లేని విధంగా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. పేరుకే సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయగా కొనుగోళ్లలో ట్రేడర్ల హవానే కనిపిస్తోంది. తేమ సాకుతో సీసీఐ కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు ట్రేడర్లు, ఇతర వ్యాపారులకు అడ్డగోలు ధరకు విక్రయిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో గత రెండు మూడేళ్లలో క్రమంగా పత్తి సాగు తగ్గుతోంది. ఈ ఏడాది 42,730 ఎకరాల్లో పత్తి చేయగా అకాల వర్షాలతో దిగుబడులు దెబ్బతిన్నాయి. ఎకరాకు కనీసం 9 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాల్సిన చోట 6-7 క్వింటాళ్ల వరకే వస్తోందని ఒక పక్క రైతులు వాపోతున్నారు. వచ్చిన దిగుబడికైనా ఆశించిన రీతిలో ధర ఉంటుందా? అంటే సీసీఐ పుణ్యమా అని అధికూడా దక్కడం లేదు. 38,450 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేయగా జిల్లా వ్యాప్తంగా 9 జి న్నింగ్ మిల్లులు, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కానీ, ఇప్పటి వరకు ఒక్క జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లోని కేంద్రాన్ని మా త్రమే వారం కింద ప్రారంభించింది. కేవలం ముగ్గురు రైతుల నుంచి 60 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేశారంటే సీసీఐ ఏ స్థాయిలో పత్తి కొనుగోళ్లు జరుపుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ట్రేడర్లు, చిన్న వ్యాపారులు, దళారులకు రైతులు అతి తక్కువ ధకు విక్రయించుకునే పరిస్థితి వచ్చింది. ఒక్క జమ్మికుంట మార్కెట్లోనే ఇప్పటి వరకు 3,500 క్వింటాళ్ల పత్తి విక్రయించగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.7,521 ఏ ఒక్క రైతుకూ దక్కలేదు. ట్రేడర్లు, ఇతర వ్యాపారులు రూ.6,300 నుంచి రూ.6,600 మించి ధర పెట్టడం లేదు. రోజుకు ఒకరిద్దరు రైతుల పత్తికి మాత్రమే రూ.7 వేలు చెల్లిం చి గరిష్ట ధర కింద చూపుతున్నారు. ఇంత దారుణమైన పరిస్థితిని తామెప్పుడూ ఎదుర్కోలేదని పత్తి రైతులు వాపోతున్నారు.
రైతులు తెచ్చిన పత్తిని ట్రేడర్లు కూడా అయిష్టంగానే కొంటున్నారని తెలుస్తోంది. పత్తిలో తేమ శాతం అధికంగా ఉండడం, రంగు మారడం, గింజ పొడవు రాకపోవడం వంటి కొన్ని కారణాలను చూపుతూ ధరను దారుణంగా తగ్గిస్తున్నారు. సీసీఐ నిబంధనల ప్రకారం చూస్తే తేమ 8 నుంచి 12 శాతం మాత్రమే ఉండాలి. కానీ, ప్రస్తుతం 30 నుంచి 40 వరకు ఉంటోందని, అందుకే సీసీఐ పూర్తి స్థాయిలో కొనుగోళ్లు ప్రారంభించడం లేదని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. నిజానికి ట్రేడర్లు కొనుగోలు చేస్తున్న కొందరు రైతులకు సంబంధించిన పత్తి నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఉన్నా సీసీఐ కొనుగోళ్లు జరిపేందుకు ముందుకు రావడం లేదనే ఆరోపణలు విపిస్తున్నాయి. ప్రతి రోజూ మార్కెట్‌కు వచ్చే పత్తిలో రూ.6,600 నుంచి రూ.7 వేల ధర పలుకుతున్న పత్తిలో తేమ శాతం తక్కువే ఉంటోందని, సీసీఐ కొంటే తమకు కనీస మద్దతు ధర వచ్చేదని రైతులు వాపోతున్నారు. తమ అవసరాల కోసం, అప్పులు చెల్లించుకునేందుకు పత్తి విక్రయాలు ఎప్పటికప్పుడు చేయక తప్పడం లేదని చెబుతున్నారు. కానీ, ఎఫ్ఏక్యూ నిబంధనల ప్రకారం ఉన్న పత్తిని కూడా సీసీఐ కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతోనే తాము ఆవేదనకు చెందుతున్నామని స్పష్టం చేస్తున్నారు.
జమ్మికుంట లాంటి అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ పరిధిలో 10 జిన్నింగ్ మిల్లులు, 16 మంది లైసెన్స్డ్ ట్రేడర్లు ఉన్నారు. మార్కెట్ పరిధిలో ప్రస్తుత సీజన్లో 1.60 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఇప్పుడు మార్కెట్‌కు వస్తున్న పత్తి నాసిరంగా ఉన్నదని కొందరు ట్రేడర్లు కూడా పత్తి కొనుగోళ్లను నిరాకరిస్తున్నారు. అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పత్తిని సీసీఐ ఎలాగూ కొనడం లేదు. ట్రేడర్లు సైతం ఇది పనికి రాని పత్తిగా నిర్ధారించి కొనేందుకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, తదితర రాష్ర్టాల నుంచి వచ్చిన పరుపుల వ్యాపారులు అడ్డగోలుగా ధరలు తగ్గించి కొనుగోళ్లు జరుపుతున్నారు. ఇలాంటి పత్తి క్వింటాలుకు కనీసం రూ.4 వేల నుంచి రూ.5 వేలకు మించి పోవడం లేదు. ఆదిలాబాద్, వరంగల్ మార్కెట్ల తర్వాత ఎక్కువగా జమ్మికుంట మార్కెట్‌కే ఉత్తర తెంగాణలో పత్తి విక్రయాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో పరుపుల వ్యాపారులు పెద్ద సంఖ్యలో వచ్చి కొనుగోళ్లు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ట్రేడర్లు కొనుగోలు చేసిన దానికంటే ఇలాంటి వ్యాపారులు కొనుగోలు చేసిందే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే సీసీఐ మాత్రం రెండో పికింగ్ తర్వాతనే తాము కొనుగోళ్లు జరుపుతామని భీష్మించుకుని కూర్చోవడం, రాష్ట్ర ప్రభుత్వం కనీసం సీసీఐ అధికారులతో చర్చించేందుకు చొరవ చూపకపోవడంతో రైతులు అడ్డగోలు ధరకు పత్తిని విక్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు.