sand mafia | తిమ్మాపూర్, సెప్టెంబర్11: ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమార్కులు ఎక్కడివారక్కడే దోచుకుంటున్నారు. పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని ఉద్దేశంతో అధికారులు ఇసుక, మట్టి విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కానీ దీన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు మాత్రం ఇందిరమ్మ ఇండ్ల కోసం మట్టి కొడుతున్నట్టు అధికారులకు చూపిస్తూ.. బయటకు అధిక ధరకు మట్టి అమ్ముకుంటూ అక్రమంగా ఆర్జిస్తున్నారు.
తిమ్మాపూర్ గ్రామ శివారులో పోరండ్ల వెళ్లేదారిలో ఉన్న గ్రానైట్ క్వారీ ఆవరణలో భారీ స్థాయిలో గుంతలు తవ్వుతూ మట్టిని తరలిస్తున్నారు. అటువైపు వెళ్తే తప్ప ఎవరికీ కనిపించని ఏరియాలో గ్రామానికి చెందిన అధికార పార్టీ నేతల అండతో మూడు రోజులుగా పొద్దంతా నడిపిస్తూ ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తున్నారు.
గురువారం తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి సమాచారం రావడంతో సిబ్బందిని పంపించారు. విషయం తెలుసుకున్న అక్రమార్కులు అధికారులు వెళ్ళేసరికే పరారయ్యారు. నిత్యం మట్టిని దోపిడీ చేస్తున్నారని.. విచారణ చేసి సదరు జేసీబీ, ట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.