Godavarikhani | కోల్ సిటీ , మే 17: కళాకారులకు, కళలకు పుట్టినిల్లుగా పేరున్న గోదావరిఖనిలో కళా భవనం నిర్మాణంలో స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపాలని, అలాగే వృద్ధ కళాకారులకు పెన్షన్, పేద కళాకారులకు, డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేయాలని గోదావరి కళా సంఘాల సమాఖ్య ప్రతినిధులు విన్నవించారు. స్థానిక ఆర్సీఓఏ క్లబ్ లో గోదావరి కళా సంఘాల సమాఖ్య 37వ వార్షికోత్సవం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కళోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నఈ ప్రాంతంకు చెందిన పలువురు కళాకారులకు గోదావరి కళారత్న పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రామగుండం ఉద్యమాలకే కాదు.. కళారంగానికి కూడా పెట్టింది పేరు అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమంలో ఈ ప్రాంత కళాకారుల పాత్ర అనిర్వచనీయమని కొనియాడారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ కళోత్సవాలు జరిగినా రామగుండం కళాకారులు అడుగు పెట్టని వేదిక లేదన్నారు.
కళలనే నమ్ముకొని కళలే ఊపిరిగా బతుకుతూ కళా సంపదను ఎంతోమందికి పంచి పెడుతూ కళాకారుల ను తయారు చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న పలువురు సీనియర్ కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు. వీరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు, పింఛన్లు మంజూరయ్యేలా స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపాలని, అలాగే గోదావరిఖనిలో అర్ధాంతరంగా ఆగిపోయిన కళా భవనం నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా కళాకారుల ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి.
సమాఖ్య అధ్యక్షుడు కనకం రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భారత్ స్కాట్ అండ్ గైడ్స్ రాష్ట్ర సెక్రెటరీ ఈర్ల జాన్ సామ్యుల్, సమాఖ్య వ్యవస్థాపకుడు బొంకూరి మధు, సీనియర్ కళాకారులు దామెర శంకర్, సంకె రాజేష్, కాశిపాక రాజమౌళి, రేణిగుంట్ల రాజమౌళి, ప్రభుత్వ సాంస్కృతిక సారథి కో-ఆర్డినేటర్ దయానర్సింగ్, మాదరి వాసు, గద్దల శశిభూషణ్, వెంకటరాజు, రవీందర్, జనగామ రాజనర్సుతోపాటు 500 మంది కళాకారులు పాల్గొన్నారు.