Godavarikhani | కోల్ సిటీ, ఆగస్టు 9: తోబుట్టువుల బంధానికి ప్రతీక రాఖీ పండుగ. తోడ బుట్టిన తమ్ముళ్లు, అన్నలకు రాఖీలు కట్టాలని ఆడపడుచులు ఏడాది కాలంగా ఎదురుచూస్తారు. కానీ ఎవరూ లేని వారు ఎవరి కోసం ఎదురుచూస్తారు.. తమకు తోబుట్టువులు ఉంటే బాగుండు.. రాఖీలు కట్టి ఆ ప్రేమానురాగాలను ఆస్వాదించాలని సోదరులు లేని ఆడపిల్లలకు కలగడం సహజం. గోదావరిఖని గాంధీనగర్ కు చెందిన ఎం.సీ.ఏ విద్యార్థి బాసాని అమూల్య శనివారం తల్లిదండ్రులు లేని అనాధ పిల్లల్లో తన సోదరులను చూసుకుంది. అమూల్య ఇంటర్ చదువుతున్న సమయంలో తండ్రి లక్ష్మణ్ అకాల మృతి చెందాడు.
అప్పటి నుంచి తల్లి స్వరూప కూలీనాలి పని చేసుకుంటూ కూతుర్ని చదివిస్తుంది. ప్రస్తుతం అమూల్య వరంగల్ లో ఎం.సీ.ఏ విద్యను అభ్యసిస్తుంది. ప్రతి ఏటా మాదిరిగానే ఈ రాఖీ పండుగకు ఇంటికి వచ్చింది. చుట్టు ప్రక్కల ఆడపిల్లలు తమ సోదరులకు రాఖీలు కట్టడం చూసి తనకు సోదరులు ఉంటే బాగుండు అనుకుంది. వెంటనే అదే కాలనీలోని ఎండీహెచ్ డబ్ల్యుఎస్ అనాధ పిల్లల ఆశ్రమంకు వచ్చింది. అక్కడ తల్లిదండ్రులు కోల్పోయి అక్కా, చెల్లెళ్లు లేని అనాధ పిల్లలకు స్వయంగా రాఖీలు కట్టి సోదరిగా ప్రేమను పంచింది. నోరు తీపి చేసి రాఖీ శుభాకాంక్షలు తెలిపింది. ఈ సంఘటన బస్తీ వాసుల హృదయాలను చలింపచేసింది.
ఆశ్రమ పిల్లలు సైతం ఎంతగానో భావోద్వేగంకు లోనయ్యారు. అమూల్య మాట్లాడుతూ తనలాగే తోబుట్టువులు లేరన్న బాధ ఈ అనాధ పిల్లల మనసులను మరింత గాయపర్చవద్దని ఉద్దేశంతో ఆశ్రమంకు వచ్చి రాఖీలు కట్టి వారి కళ్లలో ఆనందం చూడటం ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు. తాను ఏదైనా ఉద్యోగం సంపాదించాక ఈ ఆశ్రమంలోని పిల్లలకు నావంతుగా సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొంది. అమూల్యను పలువురు అభినందించారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకుడు పోచంపల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.