కలెక్టరేట్, జూన్ 22: కరీంనగర్ సమగ్రాభివృద్ధికి సహకరించాలని, పెండింగ్ పనులకు నిధులు కేటాయించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. ఇన్చార్జి మంత్రిగా మొదటిసారి తుమ్మల నాగేశ్వర్రావు ఆదివారం కరీంనగర్‌కు రాగా, శాలువా కప్పి సన్మానించారు. అనంతరం వ్యవసాయం, విద్య, గృహనిర్మాణం, పంచాయతీరాజ్ శాఖల పనితీరుపై ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, సంబంధితశాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి తుమ్మల కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల మాట్లాడారు. దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా కరీంనగర్లో నిర్మించిన తీగల వంతెన నిర్వహణపై నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదని, డైనమిక్ లైట్ల వినియోగం లేకపోవడంతో వంతెన కళ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ పనుల్లో కూడా వేగం లోపించిందని, కొద్ది నెలల నుంచి ఈ మందకొడిగా సాగుతున్నాయన్నారు.
ప్రభుత్వానికి ఆదాయ వనరులైన ఈ రెండింటిని సత్వరమే పూర్తి చేయకపోవడం సరికాదని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన రోడ్ల పనుల్లో కొన్ని పూర్తికాగా, మరో 125వరకు రహదారులు అసంపూర్తిగా ఉన్నాయని తెలిపారు. సీఎం అస్యూరెన్స్ కింద విడుదలైన 350కోట్లు సరిపోకపోవడంతో మిగతా రహదారుల పనులు పూర్తి కాలేదన్నారు. వెంటనే వాటికి నిధులు విడుదల చేయాలని, వచ్చే సమావేశం నాటికి పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఆయిల్‌పామ్ తోటల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్నారు. ఆయిల్‌పామ్ సాగుతో కలిగే లాభాలపై అధికారులు రైతులకు వివరించడం లేదన్నారు. ఎకరా భూమిలో వరి సాగు చేస్తే వచ్చే లాభం కన్నా రెండింతలు ఒకేసారి వస్తుందనే అంశంపై చెప్పాలన్నారు. పంట కాతదశకు వచ్చే దాకా మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని.. ఆ తర్వాత 30ఏండ్ల వరకు ఎలాంటి పెట్టుబడి లేకుండా టన్నుల కొద్ది గెలలు పొందవచ్చనే అంశాన్ని రైతులకు తెలియజేస్తే.. ఆయిల్‌పామ్ సాగుకు రైతులు మళ్లే అవకాశాలు ఉంటాయన్నారు. ఆయిల్‌పామ్ గెలలు కోయడంలో కూడా ప్రభుత్వం సరైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.