siricilla | సిరిసిల్ల టౌన్, మే 4: సిరిసిల్లలో గత పదహారు నెలలుగా ఉపాది కరువై అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన నేత కార్మికుడు విఠల్ ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యగానే పరిగణిస్తున్నామని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ ఆరోపించారు. స్థానిక జిల్లా ఆసుపత్రిలో బాధిత కుటుంబ సభ్యులను ఆయన ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం నేత కార్మికుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. నేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పిస్తామని చెప్పిన నాయకుల హామీలు అమలు ఎప్పుడు చేస్తారో చెప్పాలన్నారు.
ఉపాధి లేక నేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, ఇటీవల సిరిసిల్లకు వచ్చిన చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వంలో కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు వారి సంక్షేమం కోసం అనే పథకాలు అమలుచేసిన గొప్ప నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ప్రభుత్వ వస్త్రాల తయారీతో పాటు ప్రధానంగా బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లతో సిరిసిల్ల నేతన్నల జీవితాలలో వెలుగులు నింపిన ఘనత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మాత్రమే దక్కుతుందన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకుని నేతకార్మికులకు ఉపాది అవకాశాలు మెరుగుపరచడంపై దృష్టి సారించాలని సూచించారు. ఉపాది మెరుగుపరచడంతో పాటు గిట్టుబాటు కూలీ అందించి ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న బత్తుల విఠల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్ మాజి కౌన్సిలర్ దూస వినయ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బత్తుల రమేష్, తదితరులున్నారు.