రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ)/ తెలంగాణ చౌక్: తమ దుకాణాలు తమకే ఇవ్వాలని, కేటాయించిన డీలర్ల పోస్టులు రద్దు చేయాలని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తాజామాజీ రేషన్ డీలర్లు ఆందోళనకు దిగారు. రేషన్ డీలర్ల నియామకాల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు షాపులు కోల్పోయిన 17 మంది డీలర్లు గురువారం సిరిసిల్ల సాయినగర్ వద్ద మంచినీటి ట్యాంకు ఎక్కి, పెట్రోలు బాటిళ్లు చేత పట్టుకుని మండుటెండల్లో మూడు గంటల పాటు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ డీలర్లు తాటి పద్మ, మమత, కొండ పద్మ, శారద, రేణ మాట్లాడారు.
గత ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇచ్చిన దుకాణాలను 12 ఏండ్లుగా నడుపుకుంటున్నామని తెలిపారు. అధికారులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే దుకాణాలకు నోటిఫికేషన్ వేసి, పరీక్షలు నిర్వహించారని, డీలర్ షిప్లను రద్దు చేసి, మరొకరికి కట్టబెట్టారన్నారు. తమ జీవనోపాధి పోయిందని, బతుకుదెరువులేక ఇక చావే గతి అంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. కాంగ్రెస్ నాయకులు దుకాణాలను పైసలకు అమ్ముకుని అన్యాయం చేశారని ఆరోపించారు. అర్ధరాత్రి తహసీల్దార్ కార్యాలయంలో నియామకపు పత్రాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
సాయంత్రం 5గంటలు దాటితే టైం అయిపోయిందంటూ కసురుకునే అధికారులు రాత్రి వేళల్లో కార్యాలయాలకు వచ్చి లీడర్లకు నియామక పత్రాలు అందజేయడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. రేషన్ షాపులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకునే వరకు ట్యాంకు దిగమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. ఏఎస్పీ చంద్రయ్య ఘటన స్థలానికి చేరుకుని సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని ఎంత నచ్చచెప్పినా వారు వినిపించుకోలేదు.
తమకు జరిగిన అన్యాయంపై కలెక్టర్కు వినతి పత్రం సమర్పించినా ఏమ్రాతం పట్టించుకోలేదని ఆరోపించారు. తహసీల్దార్ షరీఫ్ వచ్చి కలెక్టర్ అందుబాటులో లేరని, వినతి పత్రం ఇస్తే కలెక్టర్కు ఇస్తానని చెప్పడంతో శాంతించి ఆందోళన విరమించారు. ఇక్కడ డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, రేషన్ డీలర్ల అధ్యక్షుడు రెడ్డిమల్ల హనుమండ్లు, కొండ పద్మ, వీ మమత, ఆడెపు సౌజన్య, జిందం రేఖ, బండారి శారద, తాటి పద్మ తదితరలు ఉన్నారు.