ఉద్యమాల గడ్డ.. సిరిసిల్ల జిల్లా ఆది నుంచీ గులాబీజెండాకు అండగా నిలుస్తున్నది. నాటి స్వరాష్ట్ర ఉద్యమం నుంచి నేటి దాకా వెన్నంటే నడుస్తున్నది. కేసీఆర్‌తోపాటు కేటీఆర్ వెన్నంటి నిలుస్తూ, ఎన్నికలు ఏవైనా ‘భారత రాష్ట్ర సమితి’కే పట్టం గడుతున్నది. ప్రతిపక్షాల మాటలను విశ్వసించకుండా, తాజా సెస్ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించింది. ‘అభివృద్ధి చేశాం.. అండగా ఉన్నాం.. ఆశీర్వదించండి’ అంటూ అమాత్యుడు రామన్న పిలుపు మేరకు కదిలివచ్చి, ఏకంగా 15 మంది పార్టీ బలపరిచిన అభ్యర్థులకు జైకొట్టింది. నాలుగోసారి గులాబీ జెండా ఎగురనుండగా, బీఆర్ఎస్గా మారిన తర్వాత తొలివిజయం కావడంతో సంబురం అంబురాన్నంటింది.
కరీంనగర్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ సిరిసిల్ల (నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల ప్రజలు ఆది నుంచీ బీఆర్ఎస్కు జైకొడుతున్నారు. 2001లో పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు అండగా నిలుస్తున్నారు. కేసీఆర్‌తోపాటు కేటీఆర్ వెంటే నడుస్తూ, ఎన్నికలు ఏవైనా పట్టం గడుతున్నారు. భారత రాష్ట్ర సమితిగా మారిత తర్వాత మొదటి సారి జరిగిన సెస్ ఎన్నికల్లోనూ గెలిపించి ప్రగతి ప్రదాత రామన్నకు అండగా నిలిచారు.
పార్టీ పెట్టిన కొద్ది నెలల్లోనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సిరిసిల్ల తాలుకాలోని తొమ్మిది మండలాలకు 8 ఎంపీపీలు, 8 జడ్పీటీసీ స్థానాలను కట్టబెట్టారు. 2004లో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ పోటీ చేయగా, అప్పటి నేరెళ్ల నియోజకవర్గం 30 వేలకు పైగా మెజార్టీని ఇచ్చారు. ఆ తర్వాత కాసిపేట లింగయ్యను గెలిపించారు. రాష్ట్ర సాధనలో భాగంగా 2006లో కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో వచ్చిన ఉపఎన్నికల్లో కేసీఆర్‌కు 40 వేల పైచిలుకు మెజార్టీనిచ్చారు.
2008లో సైతం రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లగా, అప్పుడు కూడా నేరెళ్ల నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ కట్టబెట్టారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నేరెళ్ల సిరిసిల్ల నియోజకవర్గంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా పోటీ చేసిన కేటీఆర్‌ను గెలిపించారు. అనంతరం వరుస విజయాలను అందిస్తూనే ఉన్నారు. 2010, 2014 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించినా, 2018లో మాత్రం ఏకంగా 89,009 అసాధారణ మెజార్టీని ఇచ్చారు.
మరోసారి ఎగిరిన జెండా..
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2007లో సెస్‌కు ఎన్నికలు జరిగాయి. ఆ నాడు సెస్ పరిధిలో 11 స్థానాలుంటే 11 స్థానాల్లోనూ గులాబీ బలపరిచిన అభ్యర్థులే ఘనవిజయం సాధించారు. చైర్మన్‌గా చిక్కాల రామారావు, వైస్‌చైర్మన్‌గా గూడూరి ప్రవీణ్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2010, 2016లో జరిగిన ఎన్నికల్లోనూ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ గులాబీ జెండా ఎగిరింది. ఈ సారి స్థానాల సంఖ్య 15కు పెరిగినా.. అన్నింటా పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందారు.
ప్రతిపక్షాలకు చుక్కెదురు
సెస్ ఎన్నికల వేళ ప్రతిపక్షాల నాయకులు ఎప్పటిలాగే ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు చేసిన అభివృద్ధిని వివరిస్తుంటే.. బీజేపీ అభ్యర్థులు మాత్రం చేసిందేమిటో? చేసేదేమిటో చెప్పకుండా ఎప్పటిలాగే రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ఆ అభ్యర్థులే కాదు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ కూడా అదే తీరున వ్యవహరించారు. సెస్ ఎన్నికలు చిన్నవంటూనే ఆయనే వచ్చి గురువారం ప్రచారం చేశారు.
బీఆర్ఎస్ను గెలిపిస్తే సెస్‌కు ఇవే ఆఖరు ఎన్నికలు అవుతాయని, సెస్‌ను ఎలక్ట్రిసిటీ బోర్డులో కలిపేస్తారంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. దాంతో రైతులు, నేతన్నలు, వినియోగదారుల నుంచి అప్పుడే ఆగ్రహం వ్యక్తమైంది. ఈ మోసపూరిత మాటలను తిప్పికొట్టారు. ఏకంగా పార్టీ బలపరిచిన 15 మంది అభ్యర్థులకు జైకొట్టారు. నిరంతరం ప్రజల మధ్య ఉన్న మంత్రి కేటీఆర్‌కు అండగా నిలిచారు.