Chirumalla Rakesh Kumar | పెద్దపల్లి, జూలై 16(నమస్తే తెలంగాణ) : ఉత్తర తెలంగాణలో సాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చుతోందని, ఎండిపోయిన చెరువులను నింపేందుకు ప్రభుత్వం తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపులను ప్రారంభించాలని బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి చిరుమల్ల రాకేష్ కుమార్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి ప్రాంతంలో ఎల్లమ్మ చెరువు సహా అనేక చెరువులు పూర్తిగా ఎండిపోవడంతో రైతులు నాట్లు వేయలేక అల్లాడుతున్నారని రాకేష్ కుమార్ పేర్కొన్నారు.
డీ-83, డీ-86 కాలువల ద్వారా నీటి సరఫరా నిలిచిపోవడంతో సాగునీటి సమస్య జఠిలమైందని తెలిపారు. గతేడాది ఇదే సమయానికి జిల్లాలో 2.79 లక్షల ఎకరాల్లో సాగు జరగగా, ఈసారి కేవలం 12 వేల ఎకరాలకు మాత్రమే పరిమితమైందని గణాంకాలను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కంటే బీఆర్ఎస్ నాయకులను విమర్శించడానికే ప్రాధాన్యత ఇస్తోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రెస్మీట్లతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
‘రక్తాలతోనే పంటలు పండుతాయి అనుకుంటే, ఎవరి రక్తం పారాలో ప్రజలే నిర్ణయిస్తారు’ అంటూ అంటూ రాకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, రెండేళ్లు గడిచినా కనీసం పనులు ప్రారంభించలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సవాల్‌ను ప్రభుత్వం స్వీకరించాలని, అవసరమైతే నిర్వహణ బాధ్యతలను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే విజయరమణరావు పెద్దపల్లి సాగు పరిస్థితిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే శ్రీధర్ బాబు తండ్రి పేరుతో ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిని నింపాలని కోరారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 7 టీఎంసీల నీరు మాత్రమే ఉందని ఆయన వెల్లడించారు. తాగునీటి అవసరాలు, ఎన్టీపీసీ అవసరాలను దృష్టిలో ఉంచుకుంటే, సాగునీటికి తీవ్ర కొరత తప్పదని హెచ్చరించారు.
గోదావరిలో నీటి ప్రవాహం తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రభుత్వం అత్యవసరంగా చర్యలు చేపట్టి శ్రీపాద ఎల్లంపల్లిని నింపి, ఆ నీటిని చెరువులకు తరలించాలని కోరారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయ శాఖ అధికారులు ఆరుతడి పంటలు వేయాలని సూచిస్తున్నారని, ఇది రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి ఎద్దడికి నిదర్శనమని రాకేష్ కుమార్ అన్నారు. రాజకీయ విమర్శలు మానుకొని, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో భవిష్యత్తులో తాగునీటి సమస్య కూడా తలెత్తే ప్రమాదం ఉందని, రైతులు ఎదుర్కొంటున్న కష్టాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉప్పు రాజ్ కుమార్, మోబిన్, స్వామి, మేకల కుమార్ యాదవ్, కర్రె దేవేందర్ రెడ్డి, పడాల సతీష్ గౌడ్, పోసాని శ్రీనివాస్ యాదవ్, ఉప్పు శివ కుమార్, బోయిని మనోజ్, కంచి నాగరాజ్ , పాయిలి కిరణ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.