అనధికారిక ప్లాట్లు, అక్రమ లేఅవుట్లు క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి కొత్త తిరకాసు పెడుతుండడంతో దరఖాస్తుదారులు ముప్పుతిప్పలు పడాల్సి వస్తున్నది. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్యకు పరిష్కారం కరువవుతున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది అప్లికేషన్స్ క్లియర్ చేయకపోవడం విమర్శలకు తావిస్తున్నది. మరోవైపు లేవుట్లోని ఒక ప్లాట్‌పై వివాదం ఉంటే.. దానిని ఆ సర్వేనంబర్ మొత్తానికి అన్వయిస్తూ క్రమబద్ధీకరణ చేయడం లేదు. ‘నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్’ సమర్పించినా సమస్య కొలిక్కి రావడం లేదు. ఇంకోవైపు ఇంటిమేషన్ లెటర్ ఇచ్చి పేమెంట్ చేసిన తర్వాత వందలాది దరఖాస్తులను రిజెక్ట్ కింద చూపడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. కట్టిన డబ్బులు పరిస్థితి ఏంటో తెలియక దరఖాస్తుదారులు అయోమయంలో కొట్టుమిట్టాడుతుండగా, ఈ తరహా సమస్యలు పరిష్కరించడానికి ప్రతి మున్సిపల్ పరిధిలో అనుభవమున్న సీనియర్ అధికారి అధ్వర్యంలో ఫిర్యాదు సెల్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వస్తున్నది.
కరీంనగర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో అనధికారిక లేవుట్ల ద్వారా వేలాది ప్లాట్ల్స్ విక్రయం జరిగింది. వీటిని క్రమబద్ధీకరించుకోవడానికి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ 2020ని అమల్లోకి తెచ్చింది. ఉమ్మడి జిల్లాలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 1,13,346 దరఖాస్తులు వచ్చాయి. కరీంనగర్ సూడా పరిధిలో 21,042 దరఖాస్తులు వచ్చాయి. నిబంధనల ప్రకారం 2020 అక్టోబర్ 31 నాటికి ఆన్లైన్లో రూ.వెయ్యి చెల్లించిన దరఖాస్తుదారుల భూములను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం ఇప్పుడు అవకాశం కల్పించింది. దీంతో దరఖాస్తుదారులు తమ స్థలాలు, ప్లాట్స్‌ను ఎల్ఆర్ఎస్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ అనేక కొర్రీలతో ఆగమవుతున్నారు. నిజానికి ఒక లేవుట్‌లో ఒక ప్లాట్‌పై వివాదం లేదా కోర్టు కేసులు ఉంటే.. అందులోని మొత్తం ప్లాట్స్‌కు దానిని అన్వయిస్తున్నారు. సదరు ప్లాట్స్‌పై ఎటువంటి వివాదం లేదని పేర్కొంటూ దరఖాస్తుదారులు సంబంధిత సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) సమర్పిస్తున్నారు. అయినా సమస్య ఒక కొలిక్కి రావడం లేదు. ఎన్వోసీ సమర్పించిన కొంత మందికి పని అవుతున్నా.. మరికొంత మందికి రిజెక్టు అవుతున్నది. ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే.. ‘మా చేతుల్లో ఏమీలేదు. అది సాఫ్ట్వేర్ లోపం’ అంటూ దాటవేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ సాప్ట్వేర్ కూడా అప్డేట్ కాకపోవడం దరఖాస్తు దారుల పాలిట శాపంలా మారుతున్నదన్న విమర్శలు వస్తున్నాయి. ఉదాహరణకు.. ఒక లేఅవుట్లోని ఒక ప్లాట్ మీద వివాదముంటే దానిని ఆ ప్లాట్ వరకే పరిమితం చేసే సాఫ్ట్వేర్ లేదు. ఆ వివాదాన్ని సర్వేనంబర్ మొత్తానికి అన్వయించడం వల్ల వందలాది ప్లాట్స్ క్రమబద్ధీకరణకు నోచుకోలేని దుస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి, సర్వే నంబర్లోని ప్లాట్స్వారీగా క్రమబద్ధీకరణ చేసే విధంగా అవకాశం కల్పించాలని పలు మున్సిపాలిటీలనుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లినా ఇప్పటివరకు ఎటు వంటి స్పందన లేదు. ఆదిశగా చర్యలూ చేపట్టడం లేదు. దీంతో ఒక ప్లాట్ వివాదం ప్రభావం సదరు సర్వేనంబర్‌లోని అన్ని ప్లాట్స్‌పై పడుతున్నది.
ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తుదారులు తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లను ముందుగా అన్లైన్ ద్వారా అప్లోడ్ చేయాలి. వాటిని పరిశీలించి సదరు ప్లాట్ క్రమబద్ధీకరణ చేయడానికి అర్హత ఉందా.. లేదా..? అన్నది అధికారులు ముందుగా గుర్తించాలి. ఏమైనా అనుమానాలు ఉంటే పూర్తిస్థాయి పరిశీలన చేయాలి. అన్ని నిబంధనల ప్రకారం ఉన్నాయని భావించిన తర్వాత మాత్రమే ఫీజు ఇంటిమేషన్ లెటర్ ఇవ్వాలి. సదరు ఫీజు పేమెంట్ లెటర్ అధారంగా దరఖాస్తుదారుడు.. అందులో పేర్కొన్న మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. నిబంధనల ప్రకారం ప్లాట్ క్రబద్ధీకరణ చేయడానికి ఆస్కారం లేకపోతే ఫీజు పేమెంట్ లెటర్‌కు ముందే రిజెక్టు చేయాలి. తద్వారా రిజెక్టుకు గల లోపాలను దరఖాస్తుదారులు చూసుకొని, అందుకు అనువైన పత్రాలు సమర్పించి తిరిగి అప్లోడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక సారి ఫీజు చెల్లింపు లెటర్ వచ్చిదంటే వందశాతం క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి కావాల్సిందే. కానీ, మెజార్టీ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో అలా జరగడం లేదు. ఫీజు పేమెంట్ లేటర్ ఆధారంగా సంబంధిత మొత్తాన్ని చెల్లించిన తర్వాత దరఖాస్తు రిజెక్ట్ అయినట్టు చూపుతున్నది. ఇటువంటి దరఖాస్తులు కరీంనగర్ పరిధిలోనే దాదాపు 200కుపైగా ఉన్నట్టు బాధిత దరఖాస్తుదారులు చెబుతున్నారు. ఫీజు చెల్లించిన తర్వాత రిజెక్టు అయితే దరఖాస్తుదారుడు చెల్లించిన అమౌంట్ మొత్తం సదరు దరఖాస్తుదారుడికి ఖాతాకు జమ కావాలి. ప్రస్తుతం అలా కాకుండా ప్రభుత్వ ఖాతాలోనే సదరు సొమ్ము ఉంటుంది. ఇటు క్రమబద్ధీకరణ కాక.. అటు ప్రభుత్వానికి చెల్లించిన డబ్బలు తిరిగి ఖాతాల్లో జమ కాక.. అధికారుల నుంచి ఈ విషయంపై స్పష్టత రాక దరఖాస్తుదారులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అసలు వస్తాయో.. రావో అని ఆందోళన చెందుతున్నారు.
ఎల్ఆర్ఎస్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న అనేక లొసుగులు.. కొంతమంది అధికారులకు కాసుల పంట పండిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దరఖాస్తును పూర్తిస్థాయిలో ముందుగా పరిశీలించకుండానే అధికారులు రిజెక్టు కింద చూపిస్తున్నారు. దీంతో హైరానా చెందుతున్న సదరు దరఖాస్తుదారులు అధికారుల వెంట పడుతున్నారు. ఇదే అదనుగా భావిస్తూ కొంత మంది అధికారులు.. మరింత భయబ్రాంతులకు గురి చేసి వసూళ్లకు దిగుతున్నారు. కొన్ని బల్దియాల్లో అందుకోసం కొంత మంది ప్రత్యేక ఏజెంట్లు పనిచేస్తున్నారనే విమర్శలున్నాయి. అడిగిన మొత్తం ఇవ్వకపోతే ప్లాట్స్ ఓనర్స్ భవిష్యత్‌లో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని భయపెడుతుండటంతో సదరు యజమానులు ముడుపులు ఇచ్చి పనులు ఆయ్యేలా చూసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ తరహా సమస్యలు పరిష్కరించడానికి ప్రతి మున్సిపల్ పరిధిలో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న డిమాండ్ వస్తున్నది. ఈ దిశగా చర్యలు తీసుకుంటే దరఖాస్తుదారులు నిత్యం అధికారుల చుట్టూ తిరిగే ఇబ్బందులు తప్పడంతోపాటు సమస్యను ప్రత్యేక సెల్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం ఆయ్యేలా చూసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఎల్ఆర్ఎస్లో వస్తున్న సమస్యలపై ప్రత్యేక ఫోకస్ పెట్టకపోతే దరఖాస్తుల పరిష్కారానికి మరిన్ని నెలలు పడుతుంది.
కరీంనగర్ జిల్లాకేంద్రానికి చెందిన ప్రభుత్వోద్యోగి ఒకరు తిమ్మాపూర్ మండలంలోని సర్వేనంబర్ 266, 278లో ప్లాట్ నంబర్ 49, 51ని కొన్నాడు. మొత్తం విస్తీర్ణం 475.68 చదరపు గజాలు కాగా, జోగిరెడ్డి అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. అప్పట్లో లేఅవుట్ చూపించి విక్రయించారు. అది అనధికారిక లేవుట్ అని తెలుసుకున్న సదరు ఉద్యోగి, క్రమబద్ధీకరణ కోసం 2020 సెప్టెంబర్24న రూ. వేయి చెల్లించి దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని పరిగణలోకి తీసుకొని, ఎల్ఆర్ఎస్కు ముందుగా ప్రయత్నం చేయగా సైట్లో ప్లాట్ వివాదంలో ఉన్నట్టు చూపింది. తన ప్లాట్‌పై ఎటువంటి వివాదం లేదని పేర్కొంటూ మార్చి 27న సంబంధిత సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ఎన్వోసీ తీసుకొని, సదరు డాక్యుమెంట్లను అప్లోడ్ చేశాడు. వాటిని పరిశీలించిన అధికారులు, ఆ మేరకు సంబంధిత స్థలానికి ఫీజు పేమెంట్ కోసం మార్చి 28న ఇంటిమేషన్ లెటర్ ఇచ్చారు. ఆ ప్రకారం సదరు ఉద్యోగి అదే రోజు ఫోన్‌పే ద్వారా 49,780 ఆన్లైన్ ద్వారా చెల్లించాడు. వారం పాటు సదరు అధికారులు పరిశీలిస్తున్నట్టు చూపిన సైట్ ప్రస్తుతం రిజెక్ట్ కింద చూపుతున్నది. ఇదే విషయాన్ని సదరు ఉద్యోగి సంబంధిత అధికారులతో మాట్లాడితే.. ‘ఇలా చాలా అవుతున్నాయి. వీటిపై విధి విధానాలు రావాల్సి ఉన్నది. మేం ఇప్పుడేమి చేయలేం’ అని చెబుతున్నారు. పోనీ కట్టిన డబ్బుల సంగంతి ఏంటని ప్రశ్నిస్తే.. ‘పదిశాతం కట్ అయి మిగిలిన డబ్బులు మీ ఖాతాకే జమ అవుతాయి’ అని సమాధానమిస్తున్నారు. అవి కూడా ఎప్పుడు వస్తాయో తెలియదని చెపుతున్నారు. ఇది ఒక ప్రభుత్వోద్యోగి సమస్య మాత్రమే కాదు, ఉమ్మడి జిల్లాలో వేలాది మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బంది!