Sircilla | సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 26 : కార్మిక క్షేత్రం గులాబీ మయమైంది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పార్టీ శ్రేణులు సోమవారం వార్డుల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్మిక వాడల్లో గులాబీ జెండాలతో పండుగ వాతావరణం తలపించింది. స్థానిక పాత బస్టాండ్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ భవన్ లో జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గులాబీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కార్యకర్తలు జై కేసీఆర్, జై కేటీఆర్ , జై తెలంగాణ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తోట ఆగయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం కోసం ఏర్పడిందే బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జిందం కళ, వైస్ చైర్మన్ దార్ల సందీప్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.