ప్రభుత్వ డిగ్రీ కాలేజీల వ్యవస్థ గాడి తప్పుతున్నదా..? సర్కారు పాపం.. ఉన్నత విద్యకు శాపంగా మారుతున్నదా..? ఒకప్పుడు తమ ప్రభను కోల్పోయి స్వరాష్ట్రంలో కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో పుంజుకున్న కళాశాలలు మళ్లీ పూర్వ స్థితికి చేరుతున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలకమైన కళాశాలపై ఉన్నత విద్యా శాఖ నిర్లక్ష్యం చేస్తున్నది. అత్యంత కీలకమైన పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకపోవడంతో ఇన్చార్జి ప్రినిపాళ్ల పాలనే దిక్కయింది. ఒక్కొక్కరికి మూడేసి.. అది కూడా 100 కిలోమీటర్ల దూరంలోని కాలేజీల బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నది. అయితే, కొత్తగా ధర్మపురి, గంగాధరకు మంజూరైన కాలేజీల ఎస్టాబ్లిష్మెంట్ బాధ్యతలు సైతం ఇన్చార్జిలకు ఇవ్వడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది.
జగిత్యాల, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా 152 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలుండగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 15 ఉన్నాయి. కొత్తగా మూడు మంజూరయ్యాయి. ఒకప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన డిగ్రీ కాలేజీల వ్యవస్థ కాలగమనంలో తన ప్రాధాన్యతను పోగొట్టుకున్నది. సాంకేతిక విద్యపై ప్రభుత్వాలు దృష్టిసారించడం, డిగ్రీలు చదివినా సరైన ఉద్యోగాలు, ఉపాధి మార్గాలు లభ్యం కాకపోవడంతో విద్యార్థులు ఇతర వృత్తిపరమైన కోర్సులపై దృష్టి పెట్టారు. అలాగే, ప్రైవేట్ రంగంలోనూ డిగ్రీ కాలేజీలు ఏర్పాటుకావడంతో పాతికేళ్లుగా డిగ్రీ కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. కేసీఆర్ హయాంలో డిగ్రీ విద్యను సంస్కరించడానికి పలు చర్యలు చేపట్టడంతో నాలుగైదేళ్లుగా కాలేజీలు మళ్లీ పుంజుకున్నాయి. దోస్త్ ప్రక్రియ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు దోస్ట్ ప్రక్రియ ద్వారా 66 వేల అడ్మిషన్లు జరిగినట్లు ఉన్నత విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
స్వరాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ పరిశోధనాత్మక విద్యపై దృష్టి సారించారు. అందులో భాగంగా డిగ్రీ కాలేజీల్లో సంస్కరణ చర్యలు మొదలయ్యాయి. అదే టైంలో యూజీసీ సైతం డిగ్రీ, పీజీ విద్యార్థుల్లో పరిశోధన దృక్పథం తగ్గిపోతుందని, దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం డిగ్రీ కాలేజీల్లో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. బోధనకు సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్లందరికీ పీహెచ్డీ, నెట్, సెట్ కంపల్సరీ చేసింది. పీడీ, లైబ్రేరియన్లు సైతం నెట్, సెట్, పీహెచ్డీ కలిగి ఉండాలన్న నిబంధనను తీసుకువచ్చి, పూర్తిస్థాయిలో నాణ్యమైన స్టాఫ్‌ను డిగ్రీ అండ్ పీజీ కాలేజీల్లో భర్తీ చేసే ప్రక్రియ చేపట్టారు. అలాగే, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మార్గదర్శనం చేసే బాధ్యతలను ప్రొఫెసర్ క్యాడర్లో ఉన్న ప్రిన్సిపాల్స్‌కు అప్పగించారు. కాలేజీ సాధారణ పరిపాలనతోపాటు, అకాడమిక్ విభాగంపై పూర్తి బాధ్యతలు ప్రిన్సిపాల్స్‌కు దాఖలు పరిచారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఆయా కాలేజీలు ఎంవోయూలు (విద్యకు సంబంధించి) చేసుకొని పరస్పరం అవగాహనతో విద్యార్థుల్లో పరిశీలన, పరిశోధన పెంచేందుకు అవకాశం కల్పించారు. దీని బాధ్యతలు సైతం కాలేజీ ప్రిన్సిపాల్స్‌కే ఇచ్చారు. టాస్క్ అధ్యయన కేంద్రాలు, జర్నలిజం, బ్యూటీషియన్, పర్యావరణం, పర్యాటకం, నర్సింగ్ లాంటి స్వల్పకాలిక కోర్సులను నిర్వహించుకునేందుకు అనుమతించారు. ఇవన్నీ ప్రిన్సిపాల్స్ నేతృత్వంలోనే జరిగేలా నిబంధనలు రూపొందించారు. వీటితోపాటు అటానమస్ కాలేజీలకు సంబంధించిన అకాడమిక్ కరిక్యులమ్, ప్రశ్న పత్రాల తయారీ, పరిశీలన, నిర్వహణ, మూల్యాంకనం తదితర బాధ్యతలన్నీ ప్రిన్సిపాల్స్‌కే ఇచ్చారు. దీంతో డిగ్రీ అండ్ పీజీ కాలేజీల్లో ప్రిన్సిపాల్ పోస్టులు అత్యంత కీలకంగా మారాయి.
డిగ్రీ కాలేజీలకు పూర్తిస్థాయి ప్రిన్సిపాల్స్ లేకపోవడంతో వాటి పరిపాలన పెద్ద ఇబ్బందికరంగా మారిపోయింది. అకాడమిక్ ప్రారంభ సమయంలోనే అడ్మిషన్లను పెంచుకునే ప్రక్రియ నుంచి మొదలు కొని కరిక్యులమ్‌ను డెవలప్ చేసుకోవడం, ఇతర షార్ట్‌టైమ్ కోర్సులకు సంబంధించిన అనుమతులు సాధించడం, వాటిలో పిల్లలను చేర్చడం, ఆయా కోర్సులకు సంబంధించిన అధ్యాపకులను అపాయింట్ చేసుకోవడం ఇలా అనేక కార్యక్రమాలు విద్యా సంవత్సరం ఆరంభంలో చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పూర్తిస్థాయి ప్రిన్సిపాల్స్ లేకపోవడంతో డిగ్రీ కాలేజీలు తీవ్ర ఇబ్బందుర్కొంటున్నాయి. ప్రతి పనికి, అనుమతికి, సంతకానికి నలభై, యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటున్న ప్రిన్సిపాల్స్‌ను సంప్రదించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. విద్యా సంవత్సరం ఆరంభం కావడంతో అడ్మిషన్ల ప్రక్రియ, డిగ్రీ సబ్జెక్టుల ఎంపిక, తదితర అంశాల్లోను తీవ్ర అవస్థలు ఎదురవుతున్నాయని లెక్చరర్లు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గంగాధర, ధర్మపురి పట్టణాల్లో కొత్తగా డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేయగా, వీటికి అదనపు బాధ్యతతో ప్రిన్సిపాల్స్‌ను నియమించారు. ఇలా అయితే, వారు ఎస్టాబ్లిష్మెంట్పై ఎలా దృష్టి పెడుతారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
జగిత్యాల జిల్లా రాయికల్, కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణాల్లో గతంలోనే డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. చొప్పదండి పట్టణంలో కొన్నేండ్ల పాటు డిగ్రీ కాలేజీని సైతం నిర్వహించారు. అయితే, దీనికి పూర్తిస్థాయిలో స్టాఫ్‌ను నియమించకపోవడం, వసతులు కల్పించకపోవడంతో ఆ కాలేజీలో విద్యార్థుల చేరిక క్రమంగా తగ్గిపోయింది. దీంతో డిగ్రీ కాలేజీని మూసివేశారు. అయితే, ఇప్పటికీ చొప్పదండి డిగ్రీ కాలేజీ ఉన్నత విద్యాశాఖ రికార్డుల్లో మాత్రం డిగ్రీ కాలేజీగా కొనసాగుతున్నది. అలాగే, జగిత్యాల జిల్లాలోని రాయికల్ పట్టణంలోనూ డిగ్రీ కాలేజీని గతంలో ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ సైతం ప్రిన్సిపాల్, స్టాఫ్ పోస్టులను మంజూరు చేయలేదు. దీంతో నిర్వహణ కార్యక్రమాన్ని సక్రమంగా చేపట్ట లేకపోవడంతో విద్యార్థుల అడ్మిషన్లు జరగక, కాలేజీ రికార్డులకే పరిమితమైంది. కాగా తాజాగా మంజూరైన ధర్మపురి, గంగాధర, మరో డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు జరగకపోతే ఇక్కడ కాలేజీ నడిచే పరిస్థితి లేదని, రాయికల్, చొప్పదండి డిగ్రీ కాలేజీల మాదిరి రికార్డులకే పరిమితం చేసే ఆలోచన ప్రభుత్వంలో ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే ప్రిన్సిపాల్ పోస్టులను భర్తీ చేసి, కాలేజీల నిర్వహణ గాడిలో పెట్టాలని విద్యార్థులు, విద్యావంతులు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 57 కాలేజీల్లో ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 18 డిగ్రీ కాలేజీలు ఉండగా, 8 కళాశాలలకు మాత్రమే పూర్తిస్థాయి ప్రిన్సిపాళ్లు ఉన్నారని, మిగిలిన పది అదనపు బాధ్యతలతో నడుస్తున్నాయని అంటున్నారు. జగిత్యాల జిల్లా పరిధిలో ఐదు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉండగా, ఒక్క కాలేజీకి మాత్రమే పూర్తిస్థాయి ప్రిన్సిపాల్, మిగిలిన నాలుగు అదనపు బాధ్యతలపైనే నడుస్తున్నాయి. జగిత్యాల మహిళా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ రాష్ట్రంలోనే అత్యధిక విద్యార్థులు చదువుతున్న కాలేజీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. హాస్టల్ వసతితో కూడిన ఈ కాలేజీలో 1200పైగా విద్యార్థులు చదువుతున్నారు. న్యాక్ గుర్తింపు పొందిన ఈ కాలేజీని శాతవాహన విశ్వవిద్యాలయం అటానమస్ కాలేజీగా ప్రకటించింది. ఈ కాలేజీకి ఆచార్య రామకృష్ణ ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. అయితే, రామకృష్ణ కాలేజీ బాధ్యతలు తీసుకున్న రెండు నెలలకే ఆయనకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అతిపెద్ద అటానమస్ కాలేజ్ అయిన ఎస్ఆర్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. దాదాపు రెండేండ్లుగా రామకృష్ణ రెండు కాలేజీల ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్నారు. ఆయనకు ఇటీవలే కొత్తగా ఏర్పాటు చేసిన గంగాధర డిగ్రీ కాలేజీకి సైతం ప్రిన్సిపాల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించగా, ప్రస్తుతం మూడు కాలేజీలకు ప్రధానాచార్యులుగా పనిచేస్తున్నారు. ఇక రెండుమూడు నెలల క్రితం జగిత్యాల ఎస్కెఎన్ఆర్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ విమరణ పొందారు. దాంతో హుజూరాబాద్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఇందిరా దేవికి ప్రిన్సిపాల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కొద్ది రోజులు కాగానే హుజూరాబాద్ నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మపురి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా, ఆ కాలేజీకి సైతం ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా ఇందిరాదేవికి బాధ్యతలు అప్పగించారు. ఇక కోరుట్ల, మెట్పల్లి డిగ్రీ కాలేజీల్లోనూ పూర్తిస్థాయి ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. గోదావరిఖని డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌కు మంచిర్యాల, లక్షేటిపేట డిగ్రీ కాలేజీలకు సంబంధించిన అదనపు చార్జీలు ఇచ్చారు.