MLA Vijayaramana Rao | పెద్దపల్లి, ఆగస్టు30: ఎంతో భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు పూజలందుకు గణనాథుల నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మున్సిపల్ అధికారులకు సూచించారు. మినీ ట్యాంక్ బండ్ (ఎల్లమ్మ గుండమ్మ చెరువు)పై నిమజ్జనోత్సవ ఏర్పాట్లను పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్‌తో కలిసి ఎమ్మెల్యే శనివారం పరిశీలించి పలు సూచనలు చేశారు.
వచ్చే నెల5న నిమజ్జనోత్సవం కాగా, పెద్దపల్లి పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు భక్తులు భక్తి శ్రద్ధలతో గణపతులను నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పెద్దపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి సింగరేణి సంస్థ సౌజన్యంతో 2 భారీ క్రేన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. శోభయాత్ర సజావుగా ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్, మున్సిపల్ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగుకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ లక్ష్మణ్‌రావు, ఎలక్ట్రిసిటీ ఏఈ శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.