Godavarikhani | కోల్ సిటీ, ఫిబ్రవరి 17: గోదావరిఖని ప్రధాన కూరగాయల మార్కెట్ అభివృద్ధి పనులు ఆగిపోయి ఏడాది కావస్తోంది. ఇప్పటికైనా పనుల్లో కదలిక వస్తుందా..? అభివృద్ధి ముందుకు జరుగుతుందా..? రామగుండం బల్దియా నూతన పాలక వర్గం దృష్టి సారిస్తుందా..? అన్న ఆశలు వ్యాపార వర్గాల్లో మొలకెత్తించింది. ఈ ప్రధాన సమస్య కొత్త పాలక వర్గంకు సవాల్ గా పరిణమించింది. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సుమారు రూ.2 కోట్ల నిధులతో ఆధునిక హంగులతో కూరగాయల మార్కెట్లో అభివృద్ధి పనులను ఏడాది కిందట ప్రారంభించింది. కొన్ని దుకాణాలను జూనియర్ కళాశాల మైదానంలోకి తాత్కాలికంగా తరలించింది.
మాంసం దుకాణాలకు అధునాతన వసతులతో కూడిన షెడ్లు నిర్మిస్తామని చెప్పి పాతవి తొలగించింది. హోల్ సేల్ కూరగాయల వ్యాపారులకు సైతం మౌలిక సదుపాయాలతో నూతన గదులను నిర్మించడానికి ప్రణాళికలు తయారుచేశారు. దీనిలో భాగంగా ముందుగా మార్కెట్ ఆవరణలో జంబో షెడ్లను నిర్మించారు. ఈ క్రమంలో మార్కెట్ స్థలంపై న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో అభివృద్ధి పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఇది జరిగి ఆరు నెలలు కావస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మార్కెట్ అస్తవ్యస్థంగా తయారైంది. పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ఇది జరిగి ఆరు నెలలు కావస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మార్కెట్ అస్తవ్యస్థంగా తయారైంది.
పనులు నిలిచిపోవడంతో వ్యాపారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మార్కెట్ హోల్సేల్ వ్యాపార వర్తక సంఘం అధ్యక్షులు దుండె మల్లేశం ఆధ్వర్యంలో గతంలో అధికారులను కలిసి విన్నవించారు. ప్రస్తుతం కొలువుదీరిన నూతన పాలక వర్గంపై ఆశలు పెట్టుకున్నారు. ఆరు నెలలుగా ఆగిపోయిన మార్కెట్ అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని పలువురు వ్యాపారులు, స్థానికులు పాలక వర్గంకు విజ్ఞప్తి చేస్తున్నారు.