Peddapally | సుల్తానాబాద్ రూరల్ ఏప్రిల్ 17: అంగరంగ వైభవంగా నీరుకుల్ల మానేటి రంగనాయక స్వామి రథోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కలు చెల్లించుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల మానేటి రంగనాయక స్వామి ఆలయంలో ఈ నెల 6 నుంచి 17 వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలవకుండా ఆలయ ఈవో శంకరయ్య ఆధ్వర్యంలో చలువ పందిర్లు, విద్యుత్ దీపాలు, తాగునీటి సౌకర్యం తో పాటు తదితర ఏర్పాట్లను చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం చక్రతీర్థం బలిహరణ పుష్పయాగం నాగవెల్లి క్షేత్రపాలక గ్రామబలి ఉదయం నుంచి సాయంత్రం వరకు రథోత్సవం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు చేశారు. అర్చకులు మనోహరాచార్యులు, రాజ్ కుమార్ ఆచార్యులు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ వినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఈవో శంకరయ్య, నాయకులు చిలుక సతీష్, చంద్రయ్య గౌడ్, విజేందర్ గౌడ్, రమేష్, అంజయ్య, పెద్దన్న, పెర్మారెడ్డి, దామోదర్ రావు తోపాటు తదితరులు పాల్గొన్నారు.